జోగులాంబ గద్వాల : జిల్లాలోని గద్వాల మండలం తెలుగోనిపల్లి ప్యాడీ కొనుగోలు కేంద్రం ( Procurement Centers ) లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ( Collector Rizwan ) ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులను సస్పెండ్ ( Suspensions ) చేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.
కేంద్రంలో ఇన్చార్జి గైర్హాజరు కావడం, మహిళా సంఘాల సభ్యులు లేకపోవడం, రైతులు ఎండలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తూకాలు, లిఫ్టింగ్ పనులు సరైన పర్యవేక్షణ లేకుండా కొనసాగుతున్నాయని గమనించిన కలెక్టర్ రైతులకు ఇబ్బందులు కలిగితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కేంద్రంలో ఐకేపీ మహిళా సంఘాల స్థానంలో ఇతరులు వ్యవహారాలు నిర్వహించడం గమనించి తీవ్రంగా మందలించారు. మహిళా సంఘాల సభ్యులే కొనుగోలు కేంద్రంలో నిర్వహించాలని స్పష్టం చేశారు. రిజిస్టర్లు, ఇతర రికార్డులను 15 రోజులుగా సరిగ్గా నమోదు చేయకపోవడాన్ని గమనించిన కలెక్టర్, అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు.
కేంద్రంలో సరైన నిర్వహణ లేకపోవడం, సిబ్బంది అందుబాటులో లేకపోవడం తీవ్ర నిర్లక్ష్యంగా భావించిన కలెక్టర్ బాధ్యులపై సస్పెన్షన్ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రొక్యూర్మెంట్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉందని, రైతులకు ఇబ్బందులు కలిగిస్తే సహించబోమని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట పౌరసరఫల శాఖ మేనేజర్ విమల, గద్వాల తహసీల్దార్ హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.