హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 30 : రాష్ట్రస్థాయి సీఎం కప్ అథ్లెటిక్స్, రెజ్లింగ్ పోటీలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో మూడురోజుల పాటు జరగనున్న ఈ పోటీలకు 33 జిల్లాల నుంచి సుమారు రెండు వేల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. సోమవారం మధ్యాహ్నం వర కే వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులతో స్టేడియం సందడిగా మారింది. రెజ్లింగ్ పోటీలను ఫ్లడ్ లైట్ల వెలుతురులో బాస్కెట్‌బాల్ కోర్టులో నిర్వహించనున్నారు.
ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు బాలికల బీసీ, ఎస్టీ వసతి గృహాలు, ప్రాక్టీసింగ్ స్కూల్, జేఎన్ఎస్లో వసతి సౌకర్యం కల్పించారు. క్రీడాకారులకు ఇబ్బందులు కలగకుండా, పోటీలు విజయవంతంగా పూర్తిచేసేందుకు పలు కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.
పారాలింపిక్స్ గోల్డ్‌మెడల్ విజేత దీప్తి జీవాంజి, అంతర్జాతీయ క్రీడాకారిణి అగసర నందిని ఈ పోటీల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. పోటీలో పాల్గొనే క్రీడాకారులందరికీ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో సీఎంకప్ టీషర్ట్‌ను నిర్వాహకులు అందించారు. కాగా, నగరంలోని క్రీడాకారులు, క్రీడాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని పోటీలను విజయవంతం చేయాలని హనుమకొండ జిల్లా యువజన క్రీడల శాఖాధికారి గుగులోత్ అశోక్‌కుమార్ నాయక్ కోరారు. రాష్ట్రంలోనే ఏ జిల్లాలో లేని విధంగా హనుమకొండ జిల్లా క్రీడాకారులకు కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని ట్రాక్ సూట్లు అందించినట్లు ఆయన తెలిపారు.