మక్తల్, ఏప్రిల్ 12: హిందూ ధర్మంలో వాల్మీకి మహర్షి అత్యంత గొప్పకవుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించడంతోపాటు రామాయణ మహాకావ్యాన్ని రచించి ఆదికవిగా ప్రసిద్ధి చెందారని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి (Chittem Ram Mohan Reddy) అన్నారు. మక్తల్ మండలం గడ్డంపల్లి గ్రామంలో మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హనుమంతు అధ్యక్షతన జరిగిన వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాల్మీకి మహర్షి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాల్మీకి మహర్షి అసలు పేరు రత్నాకరుడని, చిన్నప్పుడు దొంగగా జీవించేవాడని అన్నారు. అడవుల్లో పాపం చేయడం ద్వారా జీవిస్తున్న సమయంలో ఒకసారి నారద మహర్షి ఆయనను కలవడంతో వారి ఉపదేశంతో రత్నాకరుడు మారిపోయి రామా అనే నామాన్ని జపిస్తూ తపస్సు చేయడం వల్ల, కొన్ని రోజుల తర్వాత ఆయన మడిపాల (తపస్సు చేసిన స్థలం) వాల్మీకాలు (చీమల గుళ్ళు) ఏర్పడ డంతో ఆయనకు వాల్మీకి అనే పేరు వచ్చిందన్నారు.
వాల్మీకి మహర్షి తపస్సులో ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, రామాయణ కథను రచించమని ఆజ్ఞాపించారు. తపస్సులో ఉన్న సమయంలో రాముడి జీవితం మొత్తం దృష్టిలోకి రావడం వల్ల ఆయన అదే కథను 24 వేల శ్లోకాల రూపంలో రామాయణాన్ని రచించి మహా గొప్ప కవి, ఆదికవిగా పేరుగాంచారని తెలిపారు. ఈ కావ్యాన్ని రుషుల మాటల ప్రకారంగా నిజమైన చరిత్రగా భావించడం జరిగిందని పేర్కొన్నారు. వాల్మీకి రామాయణంలోని భాగాలలో ముఖ్యమైన భాగాలు బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింద కాండ, సుందరకాండ, యుద్ధకాండ భాగాలు ఎంతో ప్రసిద్ధిగాంచినవిగా చరిత్ర చెబుతుందని తెలిపారు.
వేదకాలం తర్వాత సంస్కృత సాహిత్యంలో వాల్మీకి రచనకు ఒక ప్రత్యేక స్థానం లభించిందన్నారు. వాల్మీకి మహర్షి రచించిన రామాయణం ఎందరో భక్తుల హృదయాలను ముడిపెట్టిందని సూచించారు. అనేక భాషలలోకి వాల్మీకి మహర్షి రచించిన రామాయణాన్ని అనువదించబడి రాముడు జీవితాన్ని ఆధారంగా చేసుకొని అనేక నాటకాలు, సినిమాలు, ఇవి కార్యక్రమాలు రావడం ఆనందదాయకమన్నారు. ప్రతి ఒక్కరూ వాల్మీకి మహర్షిని స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గంలో నడిచినప్పుడే హిందూ ధర్మం గొప్పగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.