‘అమ్మానాన్నలు లేని అనాథలకు చేయూతనిచ్చింది.. వారికి బాసటగా నిలుస్తున్నది.. 24 ఏండ్లుగా దిక్కూ మొక్కులేని వారిని చేరదీస్తుంది.. అన్నీ తామై వారి ఆలనా.. పాలనా చూస్తూ చేయూతనిస్తున్నది’.. వనపర్తి జిల్లా చిట్యాల శివారులోని ఆశ్రమం. ‘మానవ సేవే మాధవ సేవ’ సూక్తిని ఆదర్శంగా తీసుకొన్న దంపతులు తల్లి దండ్రులు లేని చిన్నారులకు అండగా నిలుస్తున్నారు. చిన్న నాటి నుంచి చేరదీసి పెంచి పెద్ద చేసి ఇప్పటి వరకు ముగ్గురు అమ్మాయిలకు వివాహాలు సైతం జరిపించారు. మరో యువతి జీవితంలో పెళ్లి భాజా మోగించేందుకు సిద్ధమయ్యారు. మీకు మేమున్నామంటూ భరోసానిస్తున్నారు.
– వనపర్తి, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ)
పెద్దమందడి మండలం బలిజపల్లికి చెందిన విట్టా శ్రీనివాస్‌రెడ్డి, సాయిగీత దంపతులది వ్యవసాయ కుటుంబం. 2002లో వనపర్తిలో చేయూత ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామం లో పది ఎకరాలకుపైగా ఉన్న పొలాన్ని కౌలు కిచ్చిన దంపతులు తమ సమ యాన్ని ఆశ్రమా నికే అంకితం చేశారు. వ్యయ ప్రయాసాలకోర్చి నిర్వహణ చేపట్టి మానవ సేవే.. మాధవ సేవ అన్న సూక్తిని ఆదర్శంగా నిలుస్తున్నారు.
దాతల సాయంతో వనపర్తి సమీపంలోని చిట్యాల శివారులో చేయూత ఆశ్రమానికి పక్కా భవ నాన్ని 2013లో ఏర్పాటు చేశారు. అమ్మనాన్నలు లేని వారిని చేరదీయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నారు. ఆశ్రమంలో చేరిన పిల్లలను పెంచి పెద్దచేసి విద్యా బుద్ధులు నేర్పించి ఓ ఇంటి వారిని చేస్తున్నారు. 30 మంది వరకు ఉండగా.. వీరి బాగోగులు చూసేందుకు 8 మంది సిబ్బంది ఉన్నారు. ఇదిలా ఉండగా, భార్యాభర్తల గొడవలు, ఆడపిల్ల పుట్టిందన్న నెపంతో గుర్తు తెలియని ప్రాంతాల్లో కొందరు వదిలేసిన శిశువులు వీరి చెంతకు చేరుతున్నారు.
ముగ్గురి పెళ్లిళ్లు చేసి..
ఇప్పటి వరకు ముగ్గురు అమ్మాయిలకు నిర్వా హకులు వివాహాలు జరిపించారు. 2017, 2019, 2021లో అనిత, పద్మ, స్వప్న వివాహాలు జరిపిం చారు. వీరిలో ఒకరు కిరాణం నడిపిస్తుండగా, మరొ కరు వ్యవసాయం, ఇంకొకరు హోల్‌సేల్‌గా కిరాణ వ్యాపారంలో స్థిరపడ్డారు. పెళ్లి చేయడమే కాకుండా కాన్పులు, ఒడి బియ్యం, డోలారోహణాలు నిర్వహి స్తూ కన్న తల్లిదండ్రుల మాదిరి సంప్రదాయ రీతిలో శుభకార్యాలు నిర్వహిస్తున్నారు.
ప్రముఖుల ప్రోత్సాహం..
వివాహ సందర్భాలతోపాటు ఇతర కార్యక్రమాల సం దర్భంగా పలు ముఖ్య అధికారులు, ప్రజాప్రతి నిధులు చేయూత ఆశ్రమంలో జరిగే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడ పని చేసిన కలెక్టర్లు శ్వేతా మహంతి, షేక్ యాస్మిన్ బాషా, ఎస్పీ రోహిణీ ప్రియదర్శినితోపాటు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరం జన్రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, జితేందర్‌రెడ్డి, చిన జీయర్ స్వా మి, బార్ కౌన్సిల్ రాష్ట్ర చైర్మన్ నరసింహారెడ్డి మరికొం దరు ప్రముఖులు, సంఘ సేవకులు, ప్రముఖులు బాసటగా నిలిచారు.
నేడు మోగనున్న పెళ్లి భాజా
ఆశ్రమంలో నవంబర్ 16వ తేదీన మాధవి, సందీప్‌రెడ్డి వివాహానికి నిర్వాహ కులు ఏర్పాట్లు చేశారు. అధికార, రాజకీయ ప్రముఖులకంతా ఆహ్వా నాలు అందిం చారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ గిరిధర్, నాయకులు నిరంజన్‌రెడ్డి, రావుల చంద్ర శేఖర్‌రెడ్డి, చిన్నారెడ్డి, మేఘారెడ్డికిఆహ్వాన పత్రికలను అందించారు. 500 నుంచి 800 మంది అతిథులకు సరిపడా ఏర్పాట్లను చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రస్తు తం వివాహం జరుగుతున్న మాధవి 6 నెలల వయస్సులోనే ఓ గ్రామంలోని పీర్లచాడీ వద్ద రాత్రి సమయంలో ఏడుస్తుండగా, అదే సమయంలో గ్రామానికి వెళ్లిన చిన్నారెడ్డి తన కారులో తీసుకొచ్చి 2004 డిసెంబర్ 12న చేయూత ఆశ్రమంలో అప్పగించారు.
మేం పడ్డ కష్టాలే ప్రేరణ..
మా జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మా కష్టాల ప్రేరణతోనే ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాం. భూమి ఉండి, సేద్యం చేస్తున్నా ఇన్ని సమస్యలు ఎదుర్కొంటుండగా.. ఏమీ లేని వారికి ఇంకెంత కష్టం ఉంటుందన్న ప్రేరణ మమ్మల్ని ఆశ్రమం వైపు నడిపించింది. అనాథలు, పేదలకు సేవ చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తు న్నాం. సేద్యం వదలి పెట్టాం. మాకు ఆశ్రమం తప్పా మరొక ధ్యాస లేదు. ప్రస్తుతం ఆశ్రమంలో 30 మంది ఉన్నారు. ఎల్కేజీ నుంచి ఇంజినీరింగ్ వరకు విద్యా భ్యాసం కొనసాగుతున్నది. వీరితోపాటు 7 గ్రామాల్లోని మరో 20 మంది వృద్ధులకు మధ్యాహ్నం, రాత్రివేళ భోజనాలను అందిస్తున్నాం. మేం ఉన్నంత వరకు ఈ సేవా దృక్పథాన్ని వదిలిపెట్టం. దాతల ధాతృత్వమే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నది.
– విట్టా శ్రీనివాస్‌రెడ్డి, చేయూత ఆశ్రమ నిర్వాహకుడు, వనపర్తి