జడ్చర్ల టౌన్, మార్చి 30 : మహబూబ్‌నగర్-సికింద్రాబాద్ రైల్వే డబ్లింగ్ పనులను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు పరిశీలించారు. బుధవారం సౌత్ సెంట్రల్ రైల్వేశాఖ భద్రత కమిషనర్ అభయ్ కుమార్‌రాయ్, హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ శరత్ సుధాకర్ చంద్రయాన్, రైల్వేశాఖ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అమిత్ గోయల్ పనుల పరిశీలనకు వచ్చారు. గొల్లపల్లి-దివిటిపల్లి మధ్య డబ్లింగ్ లైన్, విద్యుద్దీకరణ పనులను తనిఖీ చేశారు. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలులో వచ్చిన ఉన్నతాధికారులు ముం దుగా జడ్చర్ల మండలం గొల్లపల్లి రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. అనంతరం జడ్చర్ల స్టేషన్లో పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన చాట్స్టాల్స్ను పరిశీలించి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జడ్చర్లలో సాంకేతిక బోర్డును, నూతన భవనాన్ని పరిశీలించారు. స్టేషన్ ఆవరణలోని గార్డెనింగ్‌ను మొక్కలు నాటి నీళ్లు పోశారు. తర్వాత జడ్చర్ల నుంచి దివిటిపల్లి వరకు ప్రత్యేక మోటర్ ట్రోలర్‌లో ప్రయాణించారు. వారి వెంట రైల్వే అధికారులు, సిబ్బంది ఉన్నారు.