గతేడాది దిగుబడి లేక దిగాలు చెందిన రైతన్నకు ఈ ఏడాదైనా తెల్లబంగారం కాసులు కురిపిస్తుందనుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి ఆశలపై నీళ్లు చల్లాయి. పత్తి పంట చేతికొచ్చి దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు సీసీఐ కొనుగోలు కేంద్రాల ఊసేలేదు. భారీ వర్షాలతో ఆదిలోనే వేల ఎకరాల్లో పంట నష్టపోగా, ఇటీవల కురుస్తున్న వానలతో రైతులు ఆందోళన చెందుతున్నా రు.
ఇదే అవకాశంగా దళారులు, వ్యాపారు లు రైతులను నిలువునా ముంచుతున్నారు. ప్రభు త్వం మద్దతు ధర ప్రకటించకపోవడం, పత్తి నల్లగా మారిందని.. తేమశాతం సాకుగా చూపుతూ రూ. 4వేల నుంచి రూ.5,500కే ధరను నిర్ణయిస్తూ దో పిడీకి పాల్పడుతున్నారు. దీంతో రైతులు ప్రభుత్వ నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నాగర్కర్నూల్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : పత్తి రైతు దళారుల చేతుల్లో చిత్తవుతున్నాడు. భారీ వర్షాలతో ఇప్పటికే దెబ్బతిన్న రైతులు కష్టించి పండించిన కొద్ది పంటను కూడా అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి రైతులను ఆదుకోవడంపై దృష్టి సారించకపోవడంతో అమ్ముకొనేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. కందనూలు జిల్లాలో ఈ సీజన్లో 2,18,395 ఎకరాల్లో పత్తి పంటను పండించగా, 2,62,068 మెట్రిక్ టన్నుల పంట చేతికి వచ్చే అవకాశమున్నది.
గతంలో సీసీఐ కేంద్రాల ద్వారా రైతుల నుంచి పత్తిని సేకరించారు. అయితే ఈసారి ఇంకా సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఈసారి వర్షాలు అధికంగా కురియడంతో జిల్లాలో 4 వేల ఎకరాలకుపైగా పంట నష్టం జరిగింది. అధికంగా కురిసిన వర్షాలతో పత్తి నల్లగా మారడం, మొక్కలు పెరగకుండా పోయాయి. ప్రభుత్వం నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందించలేదు.
సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ఈనెల మొదటి వారం నుంచే చాలా మంది రైతులు పత్తిని ప్రైవేట్ వ్యాపారులు, ఫర్టిలైజర్ దుకాణదారులకు, మధ్య దళారుల ద్వారా విక్రయించుకుంటున్నారు. పత్తి నల్లగా మారిందని, తేమ కారణాలు చూపిస్తూ వ్యాపారులు క్వింటాకు రూ.4వేల నుంచి రూ.5,500 వరకు కొనుగోలు చేస్తున్నారు. కొందరు వ్యాపారులు బొలేరోలు, లారీల్లో గ్రామాల్లోకి వచ్చి కొంటున్నారు. పొడవు పింజం పత్తి క్వింటాకు రూ.7,521 గరిష్ఠ మద్దతు ధరగా సర్కారు నిర్ణయించింది. మధ్యరకం పింజం పత్తి ధర రూ.7,121 వరకు ఉన్నది. అయితే, ప్రస్తుతం మార్కెట్లో మాత్రం రూ.5 వేల వరకే ధర ఉండడంతో అన్నదాతలు దిగాలు చెందుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం త్వరలో సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. అధికారులు సమావేశం నిర్వహిస్తున్నారు. ఇం దులో కేంద్రాల ఏర్పాటుపై స్పష్టత వస్తుంది. కేంద్రాల ఏర్పాటు ఖరారు అయ్యాక నిబంధనల ప్రకారం పత్తి కొనుగోళ్లు ప్రారంభిస్తాం.
– రోషన్ దూబే, సీసీఐ అధికారి