గద్వాల, అక్టోబర్ 17 : ప్రభుత్వం పేరుకే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం కొన్నాళ్లకే బంద్ చేయడంతో దళారుల చేతిలో రైతులు నిలువునా మోసపోతున్నారు. పండిన పత్తిని నిల్వ చేసుకునే వీలులేక బహిరంగ మార్కెట్లో దళారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. కేసీఆర్ సర్కారులో అన్నదాతల అవసరాలకనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధరను ఇచ్చారు.
కాగా, పత్తి చివరి కాపు కాస్తున్నా నేడు కాంగ్రెస్ సర్కారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు అయోమయంలో పడిపోయారు. అసలే వర్షాలకు దిగుబడి తగ్గి నిట్టూరుస్తున్న వారికి కొనుగోలు కేంద్రాలు సైతం లేకపోవడంతో కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతేడాదితో పోలిస్తే ఈసారి భారీగా ధరలు పడిపోయాయి. గత సంవత్సరం బహిరంగ మార్కెట్లో క్వింటాకు రూ.7వేలకు పైగా ధర పలుకగా, నేడు రూ.5వేల వరకే మధ్య దళారులు కొనుగోలు చేస్తున్నారు. వర్షాల కారణంగా నేను ఇప్పటికే 75శాతం పత్తిని అమ్మేశాను. ఆశించిన స్థాయిలో ధరలు లేకపోవడంతో పెట్టుబడి కూడా వచ్చేటట్లు లేదు.
– సుధాకర్, రైతు, బుక్కాపురం, అలంపూర్ మండలం
రైతులకు పంట మొదటి దశ చేతికందే సమయంలోనే ప్రభుత్వాలు కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేయాలి. పత్తి రెండు, మూ డు సార్లు తీశాక కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు. అప్పటికే ఉన్న పత్తి దళారులకు అమ్ముకోవాల్సి వస్తుంది. అలాగే మద్దతు ధర కేటాయించాలి.
-ఈదన్న, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, జోగుళాంబ గద్వాల
సీసీఐ ఆధ్వర్యంలో ఉండవల్లి మండలంలోని సిద్ధి వినాయక కాటన్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభిస్తాం. నిబంధనల మేరకు గరిష్ఠ మద్దతు ధర క్వింటాకు తేమ శాతాన్ని బట్టి రూ.7,121 నుంచి రూ. 7,521ల వరకు ఉంటుంది. గతేడాదితో పోలిస్తే ఈసారి రూ.250 ధర పెరిగింది. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కేంద్రాల్లో పత్తిని విక్రయించుకోవాలి.
– పుష్పమ్మ, మార్కెటింగ్‌శాఖ జిల్లా అధికారి, జోగుళాంబ గద్వాల