ఉమ్మడి జిల్లాలోనే తొలి చెరువుగా.. 1260లో కాకతీయుల కాలంలో గణపతి దేవుడు తవ్వించిన ‘ఖిల్లా’ గణప సముద్రానికి మహర్దశ పట్టనున్నది. నాటి చెరువును రిజర్వాయర్‌గా మార్చేందుకు ప్రభుత్వం రూ.47 కోట్లు కేటాయించింది. 2018లో బ్రాంచ్ కెనాల్‌తో ఎంజీకేఎల్ఐ లిఫ్ట్ నుంచి కృష్ణా జలాలను ఈ చెరువుకు పారించి జలాభిషేకం చేశారు. మండు వేసవిలో సైతం అలుగు పారించారు. అందుకే రిజర్వాయర్‌గా మార్చితే ఏడాది పొడవునా సాగు నీటిని పారించ వచ్చని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి నిర్ణయించారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే అంగీకరించారు. గణప సముద్రంతోపాటు బుద్ధారం చెరువును రిజర్వాయర్లుగా మార్చే ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేశారు. ఇప్పటికే ఇంజినీర్లు సర్వే చేపట్టారు. కట్ట ఎంత మేరకు పెంచాలి.. నీటిని ఏ స్థాయిలో నిలిపితే ప్రయోజనం కలుగుతుందన్న అంశాలపై అధ్యయనం చేశారు. దీంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మహబూబ్‌నగర్, జనవరి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాకతీయులు నిర్మించిన తొలిచెరువు అది. 1260లో కాకతీయుల కాలంలో వ్యవసాయం, తాగునీటి అవసరాలకు గణపతిదేవుడు తవ్వించిన చెరువుకు తెలంగాణ వచ్చాక మహర్దశ పట్టింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి యుద్దప్రాతిపదికన బ్రాంచ్ కెనాల్ నిర్మాణం చేపట్టి 13 నెలల్లోనే పూర్తిచేశారు. 2018 మేలో గణపసముద్రం కృష్ణాజలాలతో పూర్తిస్థాయిలో నిండి అలుగుపారింది. 35ఏండ్ల తర్వాత అలుగు పారిన చెరువును చూసి అన్నదాతలు పరవశించిపోయారు. ఆనాడు గణపతిదేవుడు ఈ చెరువును తవ్వించినట్లు భూత్పూర్లో శిలాశాసనం బయటపడింది. అందుకే ఈ చెరువుకు గణపసముద్రం అని, గ్రామానికి ఖిల్లాగణపురం అని పేరు వచ్చింది. ఎనిమిది శతాబ్ధాల తర్వాత గణపసముద్రం చెరువు కృష్ణాజలాలతో కళకళలాడుతున్నది.
తీరిన నీటిగోస..
ఉమ్మడి రాష్ట్రంలో నీటికి గోసపడిన వనపర్తి జిల్లాలో ప్రస్తుతం కృష్ణాజలాలు పొంగిపొర్లుతున్నాయి. ఒకవైపు జూరాల ఎడమకాల్వ, భీమా ఫేస్-2 నీటితో కళకళలాడుతుండగా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతో వందలాది చెరువులను కృష్ణాజలాలతో నింపుతుండడంతో సస్యశ్యామలంగా మారింది. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కృషితో సప్తసముద్రాల్లో ఒకటైన గణపసముద్రం చెరువును రిజర్వాయర్‌గా మార్చి ఏడాది పొడువునా కృష్ణాజలాలు ఉండేలా ప్రణాళికను రచించారు. మంత్రి విజ్ఞప్తి మేరకు గణపసముద్రం చెరువును రిజర్వాయర్‌గా మార్చేందుకు ప్రభుత్వం ఇటీవల రూ.47కోట్లు విడుదల చేసింది. అదేవిధంగా గోపాల్పేట మండలంలోని బుద్ధారం చెరువును కూడా రిజర్వాయర్‌గా మార్చేందుకు మరో రూ.45కోట్లు విడుదలయ్యాయి. దీంతో వెయ్యేండ్ల వరకు సాగు, తాగునీటికి ఢోకా లేకుండా చేయడమేకాక కరువుసీమలో జలసవ్వడిని తీసుకొచ్చిన మంత్రి నిరంజన్‌రెడ్డికి ‘నీళ్ల నిరంజనుడు’ నామధ్యేయం సార్థకమైందని జిల్లా ప్రజలు కొనియాడుతున్నారు.
రిజర్వాయర్ల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్
గణపసముద్రం, బుద్ధారం రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు అవసరమైన నిధులను కేటాయించింది. ఇదివరకే ఇంజినీర్లు సర్వే నిర్వహించి కట్ట ఎంతమేరకు పెంచాలి.. ఏ మేర కు నీళ్లు ఆపితే ప్రయోజనం చేకూరుతుందనే అంశాలపై అధ్యయనం చేశారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగేలా రెండు చెరువులను రిజర్వాయర్లుగా మార్చవచ్చని ఇంజినీర్లు సూచించారు. ఈ మే రకు ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించి రెండు ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశారు. రెండు రిజర్వాయర్ల కింద రైతులు ఎక్కువగా నష్టపోకుండా డిజైన్ చేశారు.
ఏడాది పొడవునా సాగునీరు
శ్రీశైలం బ్యాక్‌వాటర్ ఆధారంగా నిర్మించిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతో ఖిల్లాగణపురం మండలానికి నీళ్లు మళ్లించడంతో అనేక చెరువులు, వాగుల్లో ఏడాది పొడవునా నీళ్లు పారుతున్నాయి. వనపర్తి జిల్లాను ఆనుకుని కేఎల్ఐ ప్రధాన కాల్వ వెళ్తుండడంతో బ్రాంచ్ కెనాల్ తవ్వి చెరువులను నింపాలని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆలోచన చేశారు. అనుకున్నదే తడువుగా గణపురం బ్రాంచ్ కెనాల్‌తో కృష్ణాజలాలను మళ్లించి చెరువులను అలుగు పారించారు.
మిషన్ కాకతీయతో ప్రయోజనం ఉండదని..
కేఎల్‌ఐతో సాగునీటిని తీసుకురావడంతోపాటు గొలుసుకట్టు చెరువులు జలకళను సంతరించుకోవడాన్ని చూసిన నిరంజన్‌రెడ్డి.. గణపసముద్రం, బుద్ధారం చెరువులను రిజర్వాయర్లుగా నిర్మించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో సాగునీటిపై సూచనలు, సలహాలు ఇచ్చే ఈఎన్సీ సలహాదారుడిని రప్పించి సుమారు 5వేల ఎకరాల ఆయకట్టు ఉండే ఈ చెరువులను రిజర్వాయర్లుగా మారిస్తే మరింత ఆయకట్టుకు నీళ్లు ఇవ్వొచ్చని ప్రతిపాదించారు. దీంతో రంగంలోకి దిగిన ఇంజినీర్లు రెండు చెరువులను రిజర్వాయర్లుగా మార్చే ప్రతిపాదనపై పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించారు. శతాబ్ధాల కిందట నిర్మించిన గణపసముద్రం, బుద్ధారం చెరువులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లందించవచ్చని.. ఏడాది పొడువునా నీటి నిల్వ చేసుకునే అవకాశం ఉందని తేల్చడంతో మంత్రి పట్టుబట్టి ఈ రెండు చెరువులను రిజర్వాయర్లుగా మార్చాలని ముఖ్యమంత్రిని కోరారు. దీంతో నిధులు విడుదలయ్యాయి. త్వరలోనే పనులను ప్రారంభించనున్నారు. రిజర్వాయర్ల నిర్మాణంతో వనపర్తి జిల్లాలో మరో వెయ్యేండ్లపాటు సాగునీటికి ఢోకా లేకుండా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
ఆనాటి శిలాశాసనం గణపసముద్రం చెరువుకు తీసుకొస్తా
వనపర్తి జిల్లాలో గణపసముద్రం చెరువును 13వ శతాబ్దంలో కాకతీయులు తవ్వించారు. సామంతరాజులు గణపతిదేవుడు తవ్వించిన తొలిచెరువు. ఉమ్మడి జిల్లాలోనే ఇది మొట్టమొదటి చెరువు అని అప్పటి శిలాశాసనాల్లో రాసి ఉంది. అది ఇప్పటికీ భద్రంగా ఉంది. సముద్రాన్ని తలపించేలా ఉన్న చెరువును మిషన్ కాకతీయతో ఉద్దరిస్తే ప్రయోజనంలేదని భావించి రిజర్వాయర్‌గా మార్చాలని ముఖ్యమంత్రిని కోరిన తక్షణమే రూ.47కోట్లు మంజూరు చేశారు. గోపాల్పేట మండలం బుద్ధారం చెరువుకు రూ.45కోట్లు విడుదల చేస్తూ రెండు జీవోలు ఇచ్చారు. కేఎల్ఐ లింక్ కెనాల్‌తో రెండు చెరువులను రిజర్వాయర్లుగా మార్చి ఆయకట్టుకు నీళ్లిస్తాం. సాగు, తాగునీటికి ఢోకాలేకుండా చేస్తాం.
– సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి