బాలానగర్, నవంబర్ 20 : మండలంలోని అప్పాజిపల్లి ఆర్అండ్బీ రహదారి నుంచి దేవునిగుట్ట తండా వరకు బుధవారం వేసిన బీటీ రోడ్డు పనులు అధికారుల పనితీరును ప్రశ్నిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణలో బుధవారం వేసిన బీటీ రోడ్డు గురువారం ఉదయానికి తారులేచిపోయి రోడ్డు గుంతల మయంగా మారింది. ఆర్అండ్బీ రహదారి నుంచి దేవునిగుట్టతండా వరకు 1.02 కిలోమీటర్ల రహదారిని బీటీగా మార్చేందుకు 2023-24 సంవత్సరం లో టెండర్లు వేశారు. కాగా రహదారి నిర్మాణానికి సంబంధించి ఎస్టీఎస్డీఎఫ్ నిధులు రూ. కోటి రోడ్డు నిర్మాణం పనులకు కేటాయించారు.
అయితే రోడ్డు పనుల్లో ఏడాది కిందట మెటల్ (కంకర) పనులు ప్రారంభించిన గుత్తేదారు ఆనక పనులను పూర్తిచేయకుండానే వదిలేశారు. ఇటీవల అధికారుల ఒత్తిడి మే రకు బుధవారం పనులను పునఃప్రారంభించిన గుత్తేదారు బీటీ పనులు చేసే ముందు చేపట్టాల్సిన రోడ్డు పై మట్టిని తొలగించడం, గుంతల మయమైన రహదారిపై తిరిగి కంకర పనులను నిర్వహించడం వంటి కనీస ప్రమాణాలను పాటించకుండానే బీటీ పనులు చేశారు.
దీంతో ఆదరా బాదరాగా వేసిన బీటీ రోడ్డు ఒక్కరోజులోనే బీటీ తేలిపోయింది. దీంతో అధికారుల పనితీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గిరిజన సంక్షేమశాఖ ఏఈ రఘును సంప్రదించగా మెటల్ పనులు నిర్వహించి ఏడాది దాటిన విషయం వాస్తవమేనని తెలిపారు. గుంతల మయమైన రోడ్డుపై తండావాసులు మట్టిపోశారని, దానిని తొలగించి రోడ్డు పరిస్థితిని గమనించకుండా బీటీ పనులు హడావిడిగా చేయడంతో రోడ్డుపై బీటీ తేలిపోయిందని అన్నారు. రోడ్డుపై బీటీ ని మొత్తం తొలగించి, రోడ్డును నిర్మించి జరిగిన పొరపాటును సరిచేస్తామని అన్నారు.