మద్దూర్, ఫిబ్రవరి 9 : మాటల గారడి, అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసమర్థ పాలనపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పట్నం మట్లాడుతూ రైతుల పక్షాన నిలబడి వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం రైతు భరోసా, రుణమాఫీ తదితర పథకాలను అమలు చేయకుండా వారిని మోసం చేస్తున్నదని ఆరోపించారు.
దీనిని నిరసిస్తూ రైతులకు అండగా వారికి ప్రభుత్వం ఇస్తామన్న రైతు భరోసా, రుణమాఫీ, పంటల బోనస్ తదితర హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కోస్గి పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష, బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారని, నారాయణపేట జిల్లాతోపాటు కొడంగల్ నియోజకవర్గానికి చెందిన రైతులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మండలంలోని పల్లెగడ్డతండాకు చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గోపాల్, నాయకులు ఎండీ సలీం, విజయ్‌భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.