తెలంగాణ తల్లి ఆకృతి మార్పుపై బీఆర్ఎస్ భగ్గుమన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం విగ్రహంలో చేసిన మార్పులకు నిరసనగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేసిన నాయకులు.. రేవంత్ సర్కారు తీరుపై కన్నెర్ర చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించారు.
విగ్రహంలో మార్పులు కాదు.. ప్రగతి చేపట్టి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని హితవు పలికారు. ఆత్మగౌరవాన్ని చాటేలా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని అన్నారు. విగ్రహాన్ని మార్చి రేవంత్ సర్కారు సంబురాలు చేసుకోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజాపాలన ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు చరమగీతం పాడే రోజులు త్వరలోనే రానున్నాయని హెచ్చరించారు.
– నెట్వర్క్ మహబూబ్నగర్, డిసెంబర్ 9