గద్వాల/గట్టు, మార్చి 7: రైతుల బాధలు, వారి బాధ్యత ఈ ప్రభుత్వానికి పట్టదా అని గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం గద్వాల నియోజకవర్గ పరిధిలో నెట్టెంపాడు లిఫ్ట్ కింద 104 ప్యాకేజీ పరిధిలోని కొండాపురం, గువ్వలదిన్నె, వెంకటాపురం, ఈర్లబండ, గంగన్పల్లి, ఇర్కిచేడ్ గ్రామాల పరిధిలో ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి సాగునీరు అందక ఎండి పో తున్న పంటలను ఆయన రైతులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ పంటలకు నీరు అందుతాయనే ఆశతో రైతులు పంటలు సాగు చేశారని, ప్రస్తుతం పంటలు చేతికి వచ్చే దశలో చివ రి ఆయకట్టు వరకు నీరు రాక ఎండి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పంటలను కాపాడాలని అధికారులకు రైతులు వినతిపత్రం ఇచ్చినా ఎందుకు రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. రెండు రోజుల్లో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించి రైతుల పంటలు కాపాడాలని లేనిచో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
రా్రష్ట్రంలో రేంవత్రెడ్డి ప్రభుత్వం 450 మంది రైతులను పొట్టన పెట్టుకున్నదని ఆరోపించారు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు తీసుకున్న తర్వాత నీళ్లేమో పాతాలని పోయాయని, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయని ఆరోపించారు. రేవంత్ సర్కారు పరిపాలన చేతకాక, ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఆయనలో అసహనం పెరిగి పోతుందన్నారు. అందుకే ఇష్టం వచ్చినట్లు బీఆర్ఎస్ నేతలను మాట్లాడుతున్నాడని విమర్శించారు. పంటలు పరిశీలించిన వారిలో బీఆర్ఎస్ నాయకులు మోనేశ్, నూర్పాషా, శేఖర్నాయుడు, వెంకటేశ్, బీచుపల్లి, రాము, రాజు, గోపాల్, భాస్కర్, తిరుమలేశ్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.