నవాబ్‌పేట, అక్టోబర్ 27 : మండలంలోని గ్రామ పంచాయతీ నిధులకు అవినీతి చెదలు తగిలాయి. గ్రామాల్లోని వీధులను శుభ్ర పర్చేందుకు కొనుగోలు చేసే బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ మిషన్లు, లిక్విడ్ కొనుగోలులో గోల్మాల్ జరిగినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రం నుంచి మెటీరియల్ తెచ్చినా.. మహమ్మదాబాద్ నుంచి కొనుగోలు చేసినట్లు బిల్లులు సృష్టించి, రెండింతలు ధరలు వేసి ప్రతి నెలా డబ్బులు స్వాహా చేశారు. ఇందులో మండలంలోని ఓ అధికారి, కోస్గి మండలంలో పనిచేసే ఓ పంచాయతీ కార్యదర్శి కీలక సూత్రధారులుగా ఉన్నట్లు సమాచారం.
మండలంలోని గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం పనులకు చేపట్టేందుకు ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు మెటీరియల్ కొనుగోలు చేసి పనులు చేపడుతూ వస్తున్నారు. కాగా సర్పంచుల పదవీకాలం ముగిసిన తర్వాత ప్రత్యేకాధికారుల పాలనలో పంచాయతీ నిధుల వినియోగం ఇష్టారాజ్యంగా మారింది. ప్రత్యేక అధికారుల పాలనలో గత నాలుగైదు నెలల నుంచి మండలస్థాయిలోని అధికారి పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి తెచ్చి పారిశుధ్యం మెటీరియల్ తాను చెప్పిన వద్దనే కొనుగోలు చేయాలని హుకుం జారీ చేసినట్లు సంబంధిత కార్యదర్శులే చెబుతున్నారు.
జిల్లా కేంద్రంలోని ఒక షాప్‌లో ఓ అధికారి నాణ్యతలేని మెటీరియల్ తక్కువ ధరకు తెచ్చి మండలంలోని సుమారుగా 25 జీపీలకు బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ మిషన్లు, లిక్విడ్, తెల్లసున్నం లాంటివి పంపించారు. ఈ తతంగం సుమారుగా ఐదారు నెలల నుంచి కొనసాగుతున్నది. బ్లీచింగ్ పౌడర్‌కు నాణ్యతతో కూడిన బస్తాకు రూ.700 నుంచి 900వరకు ధర ఉంటుంది. కానీ ఇక్కడ బిల్లుల్లో ఒక్కో బస్తాకు రూ.1290 ధర వేసి బిల్లులు నిధులు డ్రా చేశారు. అలాగే ఫాగింగ్ మిషన్‌కు రూ.10వేలు ఉండగా రూ.16వేల బిల్లులు తీసుకున్నారు. లిక్విడ్, ఇతర సామగ్రికి సైతం అధిక ధర వేసి బిల్లులు డీపీవో కార్యాలయంలో అందజేసి డబ్బులు డ్రా చేశారు. మండలంలోని ఓ అధికారితోపాటు కోస్గి మండలంలో పని చేసే ఓ పంచాయతీ కార్యదర్శి కలిసి నకిలీ బిల్లులు సృష్టించి డబ్బులు స్వాహా చేశారు.
మహ్మదాబాద్‌లోని అంబాభవానీ ట్రేడర్స్‌లో కొనుగోలు చేసినట్లు బిల్లులు చేసి డబ్బులు డ్రా చేశారు. బిల్లులన్నీ అంబాభవానీ షాప్ ఖాతాలోకి పంచాయతీ కార్యదర్శులు డబ్బులు వేయగా ఇద్దరు ప్రధాన సూత్రధారులు డబ్బులు డ్రా చేసి మెటీరియల్ డబ్బులు చెల్లించి మిగతా ఎక్కువ వేసిన బిల్లులకు సంబంధించిన డబ్బులను స్వాహా చేసినట్లు తెలుస్తోంది. కొనుగోలు చేసింది ఒక దగ్గరైతే.. బిల్లులు మాత్రం మహ్మదాబాద్‌లో కొన్నట్లు రికార్డు చేశారు.
అలా ప్రతినెలా రూ.2లక్షలు స్వాహా చేసినట్లు బిల్లులు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేకు కూడా కొంత మంది ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దారుణమేమిటంటే మహ్మదాబాద్‌లో అంబాభవానీ అనే షాపే లేనట్లు స్థానికులు చెబుతున్నారు. అదే గ్రామానికి చెందిన ఓ పం చాయతీ కార్యదర్శి(ప్రస్తుతం) కోస్గిలో పని చేస్తున్న వ్యక్తి నకిలీ బిల్లుల వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ప్రతి నెలా అవసరం లేకున్నా తక్కువ ధరకు మెటీరియల్ పంపంచి, బలవంతంగా తమ జీపీల్లో దించి పోయారని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు.
మండలస్థాయి అధికారి ఒత్తిడి వల్లనే తాము బిల్లులు చెల్లించాల్సి వచ్చిందని చెబుతున్నారు. అలాగే కొన్ని గ్రామాలకు నూతనంగా కొనుగోలు చేసిన సింగిల్‌ఫేజ్ మోటర్లకు సైతం రెక్కలొచ్చినట్లు తెలుస్తోంది. ఒక్కో మోటార్ ధర రూ.25 వేల నుంచి 30 వేలు ఉండగా, ఏకంగా రూ.40వేలకు పైగా బిల్లులు వేసి డ్రా చేశారు. ఈ విషయమై ఎంపీవో భద్రునాయక్‌ను వివరణ కోరగా ఆయా జీపీల కార్యదర్శులే మెటీరియల్ కొనుగోలు చేశారని, తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. దీనిపై ఎంపీడీవో జయరాంనాయక్‌ను వివరణ కోరగా ఈ విషయాన్ని సంబంధిత ఉన్నతాధికారులకు తెలియజేసి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మండలంలోని వివిధ గ్రామ పంచాయతీ నిధుల వినియోగంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్నదన్న విషయం తెలియడంతో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మండల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నివేదిక కోరినట్లు తెలిసింది. గడిచిన పది నెలల కాలంలో బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ మిషన్లు, లిక్విడ్, సింగిల్‌ఫేజ్ మోటర్ల కొనుగోలుకు సంబంధించి సమాచారం ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. అలాగే మెటీరియల్ కొనుగోలు చేసిన అంబాభవానీ ట్రేడర్స్‌కు సంబంధించిన సమాచారం ఇవ్వాలని సూచించనట్లు తెలిసింది. జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం జరిగిన ఉపాధిహామీ పనుల సమీక్ష అనంతరం ఈ విషయమై అధికారులతో మాట్లాడి ఆరా తీసినట్లు తెలుస్తోంది.