గద్వాల, డిసెంబర్ 11: ప్రభుత్వం బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడంతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని 24వ వార్డులో రూ.40లక్షలతో నిర్మించిన బస్తీ దవాఖాన, రూ.20లక్షలతో ఏర్పాటు చేసిన టీపార్కు, రూ.42లక్షలతో నిర్మించిన సీసీరోడ్డును మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు లేక పేదలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పా రు. రోడ్డు ప్రమాదం జరిగినా, ఏదైనా ఆపరేషన్‌కు కర్నూలు, హైదరాబాద్ నగరాలకు వెళ్లేవారన్నారు.
వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో కరోనా సమయంలో అన్నిరకాల వైద్యసేవలు అందించిన ఏకైక ప్రభు త్వం తెలంగాణ అన్నారు. ప్రతి పేదవాడికి ప్రభుత్వ వైద్యసేవలు చేరువయ్యేలా పల్లె, బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి దవాఖానలో రోగులకు కార్పొరేట్‌స్థాయిలో వైద్యులను నియమించి సేవలదించనున్నట్లు తెలిపారు. త్వరలో జిల్లాకేంద్రంలో మరో రెండు బస్తీదవాఖానలు ఏర్పాటు చేయడానికి కృషిచేస్తానని తెలిపారు. సెలవు రోజుల్లో పట్టణ ప్రజలు కుటుంబసభ్యులతో కలిసి సేదతీరడానికి ట్రీపార్కులు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో కన్జ్యూమర్ ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, మున్సిపల్ వైస్‌చైర్మన్ బాబర్, కౌన్సిలర్ శ్రీనివాసులు, నరహరి, శ్రీనివాసులు, దౌలు, మహేశ్, నాయకులు గోవిందు, సాయిశ్యాంరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.