వనపర్తి, జూలై 21 : వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండేలా జిల్లాస్థాయి అధికారులతో ఇప్పటికే సమీక్షించినట్లు వనపర్తి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. ప్రధానంగా పాత ఇండ్లల్లో నివాసం ఉంటున్న వారు అప్రమత్తంగా ఉండాలని, ఇల్లు కూలే స్థితిలో ఉన్న వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన చర్యలపై కలెక్టర్ శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు.
నమస్తే తెలంగాణ : వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాగం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
కలెక్టర్ : ఇతర జిల్లాలతో పోలిస్తే వనపర్తిలో వర్షపాతం చాలా తక్కువగా ఉంది. ముసురు వర్షం బాగా ఉంది. పాత ఇండ్లు, మిద్దెలు కూలే ప్రమాదం ఉన్నందున తాసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశాం. పాత ఇండ్లల్లో ఉం టున్న వారిని గుర్తించి సురక్షిత ప్రాంతానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని చెప్పాం. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వానకాలం పూర్తయ్యే వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించాం. రిజర్వాయర్, పెద్ద చెరువుల్లో వరద పరిస్థితిపై సంబంధిత అధికారుల నుంచి పూర్తి సమాచారాన్ని తీసుకుంటున్నాం. వరదలు ఎక్కువగా వచ్చినట్లయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చిస్తున్నాం.
నమస్తే : సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
కలెక్టర్ : వాతావరణ మార్పులకు అనుగుణంగా వచ్చే వ్యాధులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఈ నెల 10వ తేదీన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, సంబంధిత అధికారులతో సమావేశమయ్యాం. ప్రధానంగా మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటి వ్యాధుల బారిన ప్రజలు పడకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు సూచించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే చేయడంతోపాటు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతకు సంబంధించిన కరపత్రాలను పంచి అవగాహన కల్పిస్తున్నారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ఫాగింగ్ చేయాలని ఆదేశాలిచ్చాం. సాంఘిక సంక్షేమశాఖ పరిధిలోని హాస్టళ్లు, పాఠశాలలు, కార్యాలయాల్లో 100శాతం దోమలు ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించాం. జిల్లాలో 16 డెంగీ, 6 మలేరియా హైరిస్క్ ప్రాంతాలను అధికారులు గుర్తించారని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.
నమస్తే : రవాణాకు ఇబ్బందులు కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
కలెక్టర్ : ప్రస్తుతం జిల్లాలో భారీస్థాయిలో వర్షాలు లేనందున ఇప్పటివరకు అలాంటి ఇబ్బందులు ఏమి జరుగలేదు. గతేడాది వరదలు వచ్చినప్పుడు రవాణా విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని సారించాం. వాగులు, వంకలు పొంగిపొర్లినా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడంతోపాటు ముందస్తుగా ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. మున్సిపాలిటీల్లో పెద్ద డ్రైనేజీలు నూతనంగా నిర్మించడం వల్ల వరద నీరు రోడ్లపై నిలిచే పరిస్థితి లేదు. మండలాలు, గ్రామాలకు వెళ్లే రహదారులకు ప్రస్తుతం ఇబ్బందులు లేవు.
నమస్తే : విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా తీసుకున్న చర్యల గురించి చెబుతారా?
కలెక్టర్ : వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. ప్రధానంగా రైతులు విద్యుత్ ప్రమాదానికి గురవుతుంటారు. అలాంటివి జరుగకుండా విద్యుత్ అధికారులు, సిబ్బంది ఇప్పటికే విద్యుత్ వారోత్సవాల సందర్భంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వర్షాలు వచ్చినప్పుడు తడి చేతులతో నేరుగా కరెంటుకు సంబంధించిన పనిముట్లు, పాత స్తంభాలను చిన్నారులు ముట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కరెంటు సమస్యలు తలెత్తితే తక్షణమే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి.