మహబూబ్నగర్ కలెక్టరేట్, అక్టోబర్ 23 : వచ్చే నెల 8వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. మహబూబ్నగర్ కలెక్టర్, అధికారులతో బుధవారం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ మాయాదేవి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ సమగ్ర కులా ల స్థితిగతులు తెలుసుకునేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణను పక్కాగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమగ్ర కులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషణ జరపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. అనంతరం కలెక్టర్ విజయేందిరబోయి మాట్లాడుతూ మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వా ల, నాగర్కర్నూల్ జిల్లాలకు సంబంధించి వచ్చే నెల 8వ తేదీన మహబూబ్నగర్ కలెక్టరేట్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మోహన్రావు, డీఆర్వో కేవీవీ రవికుమార్, జెడ్పీ సీఈవో వెంకట్రెడ్డి, డీఆర్డీవో నర్సింహులు, డీపీవో పార్థసారథితోపాటు అధికారులు ఉన్నారు.