మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, అక్టోబర్ 16 : మహబూబ్‌నగర్ మెప్మా పరిధిలోని మహిళా స్వయం సహాయక బృందాల నిధుల గోల్‌మాల్‌లో బ్యాంక్ అధికారులే సూత్రధారులు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంక్ లింకేజీ రుణాల మంజూరులో చోటుచేసుకున్న అంశాలు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి. కోయనగర్లోని సాయి స్లమ్ సమాఖ్యలోని అంబిక, స్పూర్తి, మాధవి, బృంద, సాయిమణికంఠ మహిళా స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన బ్యాంక్ లింకేజీ రుణాలు కమిషనర్ సంతకం, కవరింగ్ లెటర్లు లేకుండానే బ్యాంక్ అధికారులు ఒక్కో సంఘానికి రూ.10లక్షలు చొప్పున రూ.50లక్షల వరకు రుణాలు మంజూరు చేశారు.
మహిళా సంఘాల్లోని సభ్యులకు బ్యాంక్ లింకేజీ కింద రూ.10లక్షల రుణం ఇవ్వాలంటే ప్రధానంగా సూక్ష్మ రుణ ప్రణాళిక (ఎంసీపీ) అవసరం. ఈ ఎంసీపీలో పొందుపర్చిన అంశాల అధారంగా ఆన్లైన్ ఎంసీపీ జనరేట్ చేస్తా రు. కమ్యూనిటీ ఆర్గనైజర్, టౌన్ మిషన్ కోఆర్డినేటర్ సంతకాలు, మున్సిపల్ కమిషనర్ లేదా మెప్మా పీడీ సం తకం, కవరింగ్ లెటర్లు కచ్చితంగా ఉండాల్సిందే.
వీటన్నింటినీ బ్యాంక్‌లో సబ్మిట్ చేశాక.. ఫీల్డ్ అధికారి సం ఘంలోని 10 మంది సభ్యులతో నేరుగా మాట్లాడి.. ఇది వాస్తవమేనా? కాదా? అందరి ఆమోదం మేరకే బ్యాంక్ లింకేజీ రుణాలు కోరుతున్నారా? అనే తీర్మానం మేరకు ఆ సంఘం ఖాతాలో రూ.10లక్షలు డబ్బులు జమ చేయాలి. వీటిని ఆ సంఘం మహిళలు వ్యక్తిగత ఖాతాల్లోకి లేదా నేరుగా డబ్బులు డ్రా చేసుకోవాలన్నా.. బ్యాం కు మేనేజర్‌కు తీర్మానం కాపీ అందించాల్సి ఉంటుం ది. ఇవేవీ లేకుండానే నేరుగా రూ.10లక్షలు మహిళా సంఘా ల ఖాతాల్లోకి జమచేయడం, వాటిని ఇతర సంఘాలు, వ్యక్తుల ఖాతాల్లోకి మళ్లించడంపై బ్యాంక్ అధికారులే సూత్రదారులనే అనుమానాలకు బలం చేకూర్చుతోంది.
మెప్మా పరిధిలోని సాయి స్లమ్ సమాఖ్యలో మొత్తం 33 సంఘాలున్నాయి. వీటి పరిధిలో మొత్తం రూ.1.49 కోట్లు నిధులు గోల్మాల్ అయ్యాయి. చిన్న సంఘాల పొదుపుల నుంచి రూ.29,04,024లు దుర్వినియోగం చేశారు. బ్యాంక్ లింకేజీ రుణాలు రూ.85,55,514లు సంఘాల పేరుతో పొంది ఇతర ఖాతాలకు మళ్లించారు. స్లమ్ సమాఖ్య పొదుపుల నుంచి రూ.6,52,360లు, స్త్రీ నిధి రుణాలు రూ.28,24,307లు దుర్వినియోగమయ్యాయి. ఈ నిధుల దుర్వినియోగంలో బ్యాంక్ అధికారుల పాత్ర ఉందంటూ మున్సిపల్ అధికారులు ఎస్బీఐ రీజినల్ కార్యాలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో కలెక్టర్, ఎస్పీ, బ్యాంక్ ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే మహిళా సంఘాల సమస్యకు సత్వర పరిష్కారం లభిస్తుంది.