బాలానగర్, డిసెంబర్ 28 : పరీక్షలు దగ్గర పడుతున్నాయి.. టీచర్లు లేకపోతే పాఠాలు ఎవరు చెబుతారు.. పరీక్షలు ఎలా రాయాలని బాలానగర్ కస్తూర్బా పాఠశాల విద్యార్థినులు అధికారులను నిలదీశారు. శనివారం పాఠశాల, కళాశాల ఆవరణలో ఆందోళన చేపట్టారు. 20 రోజులుగా టీచర్లు సమ్మె చేస్తుండగా, తమకు పాఠ్యాంశాలు బోధించకపోవడంతో చదువులో వెనుకబడి పోతున్నామని వాపోయారు. కేవలం నైట్ డ్యూటీ సిబ్బంది మాత్రమే వస్తున్నారని, ఇలాగైతే పరీక్షలకు ఎలా సన్నద్దం కావాలని ప్రశ్నించారు.
ఆందోళన విషయం తెలుసుకున్న ఎస్సై తిరుపాజీ, ఎంఈవో శంకర్ విద్యార్థులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. చేసేది లేక ఎంఈవో శంకర్ పాఠ్యాంశాలు బోధించేందుకు మండలంలోని స్కూల్ కాంప్లెక్స్ నుంచి బోధనా సిబ్బందిని ఏర్పాట్లు చేస్తున్నట్లు హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు.
అలంపూర్, డిసెంబర్ 28 : తాత్కాలిక ఉపాధ్యాయులు వద్దంటూ శనివారం అలంపూర్ పట్టణంలోని కస్తూర్బా బాలికల పాఠశాల ఎదుట విద్యార్థులు బైఠాయించి నిరసన తెలిపారు. సమగ్ర శిక్షా ఉద్యోగుల ఐకాస పిలుపు మేరకు కస్తూర్బా పాఠశాలల బోధన సిబ్బంది 18రోజులుగా సమ్మెలో కొనసాగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ తాత్కాలికంగా కొంత మంది ఉపాధ్యాయులను ఇతర పాఠశాలల నుంచి కస్తూర్బాకు సర్దుబాటు చేసింది.
దీంతో తాత్కాలిక ఉపాధ్యాయులు మాకు వద్దంటూ.. రెగ్యులర్‌గా వచ్చే ఉపాధ్యాయులే కావాలంటూ ఆందోళన చేపట్టారు. డీఈవో దృష్టికి సమస్య తీసుకెళ్లామని, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కేజీబీవీ ప్రత్యేకాధికారి కృష్ణవేణి విద్యార్థినులకు నచ్చజెప్పగా, విద్యార్థులు ఆందోళన విరమించారు.
నవాబ్‌పేట, డిసెంబర్ 28 : మా పాఠశాలలో 20 రోజులుగా సదువు చెప్పేటోళ్లు లేరు.. ఒకరిద్దరు టీచర్లు వచ్చి అటెండెన్స్ తీసుకొని వెళ్లిపోతున్నారు.. అటెండెన్స్ ఉంటే సరిపోతదా.. చదువు చెప్పకుండా మా జీవితాలతో ఆటలాడుతారా అంటూ నవాబ్‌పేట కస్తూర్బాగాంధీ పాఠశాల విద్యార్థులు శనివారం విద్యార్థినులు మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. 6నుంచి ఇంటర్ వరకు 370 మంది విద్యార్థులు పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నారు.
20 రోజులుగా కస్తూర్బా టీచర్లు విధులను బహిష్కరించి ఆందోళన చేపడుతుండగా.. అధికారులు ఇతర పాఠశాలల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులను పంపించగా, వారు వచ్చి హాజరు తీసుకొని వెళ్లిపోతున్నారని ఆరోపించారు. దీంతో తాము పాఠ్యాంశాలు చెప్పేవారు లేక నష్టపోతున్నామని విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. స్పందించిన తాసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో జయరాంనాయక్, ఎస్సై విక్రమ్ విద్యార్థులను సముదాయించారు. ఉపాధ్యాయులు విధులకు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.