వీఆర్ఏల ఆకాంక్షను ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చారు. ఏండ్ల తరబడి క్రమబద్ధీకరణ కోసం ఎదురు చూస్తున్న వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీపికబురు అందించారు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఇతర సర్కార్ శాఖల్లో సర్దుబాటు చేయడంతోపాటు రెగ్యులర్ పేసేల్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లోపు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. తాసీల్దార్, ఆర్డీవో స్థాయి, కలెక్టరేట్లోని అధికారులకు తలలో నాలుకగా వ్యవహరిస్తున్న వీరిపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించింది. పెరిగిన జీవన వ్యయాలు, నిత్యావసర సరుకుల ధరలకనుగుణంగా 64.61 శాతం వేతనాలు పెంచడంతోపాటు ఇంక్రిమెంట్ అందించింది. త్వరలో వీరంతా రెగ్యులర్ ఉద్యోగులుగా మారనుండడంతో ఉమ్మడి జిల్లాలోని 2,766 వీఆర్ఏల కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
-నాగర్‌కర్నూల్, మే 19 (నమస్తే తెలంగాణ)
నాగర్‌కర్నూల్, మే 19 (నమస్తే తెలంగాణ) : వీఆర్ఏ లు.. రెవెన్యూ వ్యవస్థలో క్షేత్ర స్థాయిలో ముందుండే ఉ ద్యోగులు. ఇంతకుముందున్న వీఆర్వోలతో మొదలుకొని తాసీల్దార్, ఆర్డీవో స్థాయి అధికారులకూ కలెక్టరేట్లోనూ అనుభవం, అర్హతను బట్టి పనిచేస్తూ తలలో నాలుకగా వ్య వహరించే చిరు ఉద్యోగులు. వీరిపై తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ సానుకూలంగా ఉన్నది. ఏండ్ల తరబడిగా ఎదురుచూస్తున్న క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గురువారం నాటి మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానించడం విశేషం. ఫలితంగా వీఆర్ఏలు పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఉ ద్యోగులుగా మారనున్నారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థ లేకుండా చేయడమే లక్ష్యమని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆ దిశగా మరో అడుగు ముందుకు వేశారు. ఇటీవలే కాంట్రాక్టు జేఎల్, డీఎల్తోపాటు వైద్యారోగ్య తదితర శాఖలకు చెందిన 10వేల మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం విధివిధానాలను రూపొందించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్‌ను ఆదేశించింది.
దీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దాదాపుగా 2 వేల మంది వీఆర్ఏలు రెగ్యులర్ కానున్నారు. దీనికి సం బంధించి త్వరలో పూర్తిస్థాయి వివరాలను ప్రభుత్వం ప్రకటించనున్నది. వీఆర్ఏల విద్యార్హత, వయస్సును బట్టి రె గ్యులర్ కానున్నారు. రెవెన్యూ వ్యవస్థలో వీఆర్వోలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసినట్లుగానే వీఆర్ఏలనూ కేటాయించనున్నారు. ఇప్పటికే వీఆర్ఏల కోసం ప్రభుత్వం సానుకూల చర్యలు తీసుకున్నది. పెరిగిన జీవన వ్య యాలు, నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణం గా వీఆర్ఏల గౌరవ వేతనాలను ఏకంగా 64.61 శాతం పెంచింది. దీంతో ఒకేసారి రూ. 6వేల నుంచి రూ.10,500కు చేరుకున్నాయి. అలాగే మరో రూ.200 తెలంగాణ ఇంక్రిమెంట్‌గా ప్రకటించింది. ఇలా వీఆర్ఏల కోసం సీఎం కేసీఆర్ సాధ్యమైనంత సానుకూల నిర్ణయాలు తీసుకొంటూ వ స్తున్నారు. వీఆర్ఏల్లో నిరక్షరాస్యుల నుంచి పీజీ వరకు ఉన్నత విద్యార్హతలు కల ఉద్యోగులు ఉన్నారు. పలువురు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమితులయ్యారు. దీంతో వీఆర్ఏల విద్యార్హతలనూ క్రమబద్ధీకరణలో ప్రామాణికంగా తీసుకోనున్నారు. దీని ఆధారంగా ఆయా ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగులుగా నియమించనున్నారు. మొత్తమ్మీద ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేపట్టడం పట్ల వేలాది మంది వీఆర్ఏల కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు.
విధివిధానాలను బట్టి చర్యలు..
వీఆర్ఏలను రెగ్యులరైజేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో 685 మంది వీఆర్ఏలు ఉన్నారు. ఇందులో 94 మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమితులయ్యారు. వీరిలో నిరక్షరాస్యుల నుంచి పీజీ చదివిన వారూ ఉన్నారు. రెగ్యులరైజేషన్‌కు సంబంధించి త్వరలో విధివిధానాలు విడుదలవుతాయి. ఆ మేరకు వీఆర్ఏల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటాం.
– మోతీలాల్, అదనపు కలెక్టర్, నాగర్‌కర్నూల్