గద్వాల, మార్చి 19: ఎన్నికల సమయంలో ఆశ కార్యకర్తల హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ఉదయం ఏడు గంటల నుంచి ఆశ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అధికారులు ఎవరినీ ప్రధాన గేటు వైపు నుంచి లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కలెక్టర్ తమ సమస్యలను విని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆశ కార్యకర్తలు డిమాండ్ చేశారు. కలెక్టర్ వారి దగ్గరకు రాకపోవడంతో ఆక్రోశించిన ఆశ కార్యకర్తలు కలెక్టరేట్ గేటును తోసుకుంటూ కలెక్టర్ చాంబర్ వైపు దూసుకెళ్లారు. అయితే వీరిని కలెక్టర్ చాంబ ర్ వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా ఆశ వర్కర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పద్మ, సునీత, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటస్వామి, వీవీ నర్సిహ మాట్లాడారు. ఆశ వర్కర్లకు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆశ వర్కర్లకు రూ.18వేలు వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చిందని.. ప్రభుత్వం ఏర్పాటై 15నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు హామీలను అమలు చేయడంలేదని విమర్శించారు. హామీలు అమలు చేయక పోగా సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తున్న ఆశలపై అణచివేత ధోరణి ప్రదర్శిస్తుందని విమర్శించారు.
నేటి ధర్నాకు రాకుండా ఆశ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారని, ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆశ వర్కర్లకు రూ.18వేల ఫిక్స్డ్ వేతనాన్ని నిర్ణయించి, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్స్‌తో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావుకు అందజేశారు. వీరికి బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య మద్దతు తెలిపారు. ఆందోళనలో నర్సింహ, కాంతమ్మ, పద్మ, నాగప్రమీల, రేణుక, సునీత, శ్వేత, జయలక్ష్మి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.