మూసాపేట : ప్రమాదవశాత్తు వృద్ధుడు కాల్వలో పడి మరణించిన ఘటన మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలంలోని సంకలమద్ది గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వృద్ధుడు కొత్త కాలువలో పడి మృతిచెందాడు. మూసాపేట మండలంలోని తుంకినిపూర్ గ్రామానికి చెందిన లిక్కి వెంకటయ్య (71) సోమవారం సంకలమద్ది గ్రామానికి బంధువుల ఇంటికి వెళ్లాడు. తుంకినిపూర్కు తిరిగివెళ్తూ కాల్వలోపడి మరణించాడు.
అయితే సంకలమద్ది గ్రామంలో ఉన్నాడని కుటుంబసభ్యులు, ఇంటికి వెళ్లిపోయాడని బంధువులు అనుకున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం సంకలమద్ది బండ్ల గడ్డ సమీపంలో ఉన్న కొత్త కాలువ వద్దకు వెళ్లిన ఓ యువకుడికి వెంకటయ్య మృతదేహం కనిపించింది. దాంతో విషయం కాలనీవాసులకు చెప్పాడు. కాలనీ వాసులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
కాల్వలో నుంచి మృతదేహాన్ని బయటకి తీసేందుకు కాలనీవాసులు, పోలీసులు తీవ్రంగా శ్రమించారు. మృతునికి భార్య ఉత్తమ్మతోపాటు ఇద్దరు కుమార్తెలు మణెమ్మ, శ్రీదేవి, కుమారుడు సురేష్ ఉన్నారు. మరో కుమారుడు గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయాడు.