మహబూబ్‌నగర్ అర్బన్, జూలై 5 : దక్షిణ కొరి యా తరహాలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో అమ్యూజ్మెంట్ పార్కు ఏర్పాటు చేస్తామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో పర్యాటక శాఖ ఎండీ మనోహర్, అధికారులతో కలిసి మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దక్షిణ కొరియాలో ఉన్న అద్భుతమైన పర్యాటక సొ బగులను తెలంగాణలోనూ తీర్చిదిద్దుతామన్నారు. సియోల్ నగరంలోని డీ మిలిటరీ జోన్ సమీపంలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ అమ్యూజ్మెంట్ పార్క్ అ ద్భుతంగా ఉన్నదని, ప్రపంచ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నదని కొనియాడారు.
ఈ అమ్యూజ్మెంట్ పార్కును మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామం వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేస్తామన్నారు. రానున్న ఐదు నెలల్లో నిర్మాణం పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. చిన్నారులు, యువతను ఈ పార్క్ ఎంతగానో ఆకట్టుకోనున్నదన్నారు. మహబూబ్‌నగర్ తర్వాత హైదరాబాద్‌లోనూ ఏర్పాటు చేస్తామన్నారు. పాలమూరును టూరిజం డెస్టినేషన్ గా మారుస్తామని స్పష్టం చేశారు. దేశవిదేశాల పర్యాటకులు ఇక్కడికి వచ్చేలా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు.