నెట్వర్క్ నమస్తే తెలంగాణ, అక్టోబర్ 27 : మద్యం దుకాణాల నిర్వహణకు లక్కీడ్రా ముగిసింది. సోమవారం ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలకు సంబంధించి దుకాణాలకు లక్కీడిప్ తీశారు. ఆయా జిల్లాల ఐడీవోసీలో కలెక్టర్లు విజయేందిరబోయి, బదావత్ సంతోష్, ఆదర్శ్ సురభి, బీఎం సంతోష్ సమక్షంలో ఎంపిక ప్రక్రియ సజావుగా సాగింది. అదృష్టవంతులు ఎవరో తేలడంతో వారంలో ఆనందం వెల్లివిరియగా.. షాపులు దక్కని టెండర్దారులు నిరాశ చెందారు. మహిళలు సైతం పెద్ద సంఖ్యలో విచ్చేశారు. ఈసారి వ్యాపారుల్లో చాలా వరకు సిండికేట్గా టెండర్లు దాఖలు చేశారు. పదుల సంఖ్యలో టెండర్లు వేసినా అదృష్టం వరించలేదు.
మహబూబ్నగర్ జిల్లాలో 54 మద్యం దుకాణాలకు 1,634 దరఖాస్తులు రాగా ప్రభుత్వ ఖజానాకు రూ.49.02 కోట్ల ఆదాయం సమకూరింది. అలాగే నారాయణపేట జిల్లాలో 36 దుకాణాలకు 853 దరఖాస్తులు రాగా.. రూ.25.59 కోట్ల ఆదాయం సమకూరింది. రెండు జిల్లాలోని 90 దుకాణాలకుగానూ 3,571 టెండర్లు దాఖలు కాగా ప్రభుత్వానికి రూ.71.42 కోట్లు ఆదాయం సమకూరింది. కాగా ఈ ఏడాది దరఖాస్తులు 1,084 తగ్గాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచడంతో పలువురు ఆసక్తి చూపలేదు. టెండర్ల రూపేన భారీ ఆదాయం వస్తోందని ఆశించినా ఆశాభంగమే ఎదురైంది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని 34 మద్యం దుకాణాలకు 774 దరఖాస్తులు వచ్చాయి.
వనపర్తి జిల్లాలో 36 దుకాణలనుగానూ 757 దరఖాస్తులు రాగా.. అత్యంత పారదర్శకంగా లాటరీ పద్ధతిలో కేటాయింపు చేశారు. నాగర్కర్నూల్ జిల్లాలో 67 షాపులకుగానూ 1,518 టెండర్లు దాఖలు కాగా.. డ్రా తీశారు. అదృష్టం వరించి షాపులు దక్కించుకున్న వారికి రెండేళ్ల కోసం దుకాణం కేటాయించారు. నిబంధనలను అనుసరిస్తూ లైసెన్స్ ఫీజు రూపేణా 1/6 వంతు రుసుము ఖజానాలో జమ చేసేందుకు వీలుగా వేదిక వద్దనే అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఆయా జిల్లాల ఎస్పీల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపిక ప్రక్రియల్లో అడిషనల్ కలెక్టర్లు, ఎక్సైజ్, పోలీస్ శాఖలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్లో నిర్వహించిన లక్కీ లాటరీలో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని మద్యం దుకాణం నెం. 16కు మొత్తం 29 మంది టెండర్దారులు పోటీ పడగా.. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న పుష్పకు డిప్ వరించింది. ఈ విషయం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆమె ప్రభుత్వ ఉద్యోగి అంటూ షాపు నెం.16కు టెండర్ వేసిన పోటీదారులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ విష యంపై కలెక్టర్, ఎక్సైజ్ అధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.