పాలమూరు, డిసెంబర్ 12 : భక్తుల సౌకర్యార్థం మన్యంకొండ గుట్టపైకి రోప్‌వే నిర్మించాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో టూరిజం శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన్యంకొండ ఆలయానికి వెళ్లే దారిలో భారీ వరాహస్వామి విగ్రహం, కల్యాణకట్ట, కోనేరు అభివృద్ధి, మోడ్రన్ పద్ధతిలో స్టాల్స్ ఏర్పాటు, వీఐపీ గెస్ట్రూంల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. ఆలయ ప్రాశస్థ్యానికి అనుగుణంగా అభివృద్ధి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మన్యంకొండకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఆధునిక కిచెన్, నిత్యాన్నదాన సత్రాన్ని నిర్మించాలన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బడ్జెట్ హోటల్, గదులు, కల్యాణ మండపం, భోజనశాల పనులను వేగవంతం చేయాలన్నారు. అనంతరం మహబూబ్‌నగర్ పట్టణంలోని న్యూగంజ్‌లో ఉన్న లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధి, అప్రోచ్ రోడ్డు నిర్మాణంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్, టీఎస్‌టీడీసీ ఇంజినీరింగ్ అధికారులు, టూరిజం ప్రాజెక్ట్ కన్సల్టెంట్ బీకే తాటి, బాలకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.