భూత్పూర్, జూలై 19 : ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కిందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని అన్నాసాగర్ గ్రామంలోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్యే దేవరకద్ర నియోజకవర్గ స్థాయి యువగళం సమ్మేళనాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో యువకులకు యువత డిక్లరేషన్ అంటూ ఏడాదికి 2లక్షల ఉద్యోగాలను ఇస్తానని హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీని తుంగలో తొక్కారన్నారు. మహిళలకు నెలకు రూ.2500లు, వృద్ధులకు రూ.4000పింఛన్, రైతుభరోసా మూడు పంటలకు ఎకరాకు రూ.15వేలు ఇస్తానని మోసపూరిత హామీలను ఇచ్చారని తెలిపారు. ఈ హామీలను నెరవేర్చడంలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు.
ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు, యువకులు ముందుండాలని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచులు, కౌన్సిలర్లు గ్రామాలు, వార్డుల్లో ఎలాంటి అభివృద్ధి పను లు చేయకుండా స్థానికంగా ఉండే కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యంలో గెలిచిన ప్రజాప్రతినిధి తన గ్రామాలను, వార్డులను అభివృద్ధి చేయకుండా అడ్డుకోవడం ఈ ప్రభుత్వ హయాంలోనే చూస్తున్నామని ఆయన దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యతిరేక పార్టీ ప్రజాప్రతినిధులను ఇబ్బందులకు గురిచేయలేదని ఆయన అన్నారు. అదేవిధంగా సర్ ప్రక్రియలో బీఆర్ఎస్ బీఎల్ఏలు, కార్యకర్తలు చురుకుగా పని చేయాలని కోరారు.
బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి నాన్నతో కలిసి ముందు కు నడుస్తానని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కూతురు ఆల ప్రీతిరెడ్డి అన్నారు. అన్నాసాగర్‌లో మాజీ ఎమ్మెల్యే ఆల సమక్షంలో ఆదివారం జరిగిన యువగళం సమావేశంలో ఆమె మాట్లాడారు. నా న్న నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యలను వింటూ పరిష్కరించడం చూస్తూ, నాన్నకు, బీఆర్ఎస్ పార్టీని అభివృద్ధి పరిచేందుకు నా వంతు పని చేస్తున్నానని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను అరికట్టాలంటే 2028 ఎన్నికల్లో తిరిగి కేసీఆర్ సార్‌ను సీఎం చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు ఆమె తెలిపారు. నాన్నను చూసే ప్రజాసమస్యలపై ఆకర్షితురాలైనట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్‌రావుల పనితీరు నచ్చి ప్రజల మధ్యకు వచ్చినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి వచ్చేందుకు నాన్నతో పాటు ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు ఆల శ్రీకాంత్‌రెడ్డి, రెడ్డిరాజు, కౌన్సిలర్ గడ్డం ప్రేమ్‌కుమార్ మహిళా నాయకురాలు ఆల ప్రీతిరెడ్డి, సంధ్య, బీఆర్ఎస్ యువ నాయకులు 600మంది పాల్గొన్నారు.