వనపర్తిరూరల్, ఫిబ్రవరి 19: తెలంగాణ ఏర్పాటుతోనే బడుగు, అణగారిన వర్గాల ప్రజల్లో మార్పు సాధ్యమైనదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని రాజపేట శివారులోని గిరిజన భవన స్థలంలో ప్రభుత్వపరంగా నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకలకు జిల్లా గిరిజన నాయకులతో కలిసి మంత్రి హాజరై మాట్లాడారు. రేపటితరానికి సేవాలాల్ మహరాజ్ కేంద్రాలు విజ్ఞాన కేంద్రాలుగా మారాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామని తెలిపారు.
సీఎం కేసీఆర్ ముందుచూపుతో ప్రతి ఎకరాకూ సాగునీరు అందుతుందన్నారు. ఎక్కడిక్కడ ప్రాజెక్టులతో సాగునీటికి అడ్డకట్టలేయడంతో రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజలాలు ఏటా పెరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతుల చేతుల్లో సాగుభూమి 92.5శాతం ఉందన్నారు. అందులో గిరిజన రైతుల చేతుల్లో 19లక్షల ఎకరాల భూమి ఉందన్నారు. ఆనాటి ఉద్యమంలో కేసీఆర్ తెలంగాణ ఏర్పాటైతేనే గిరిజన తండాల్లో మీ పరిపాలన వస్తుందని ఇచ్చిన మాటకు కట్టుబడి తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడమే కాకుండా కొత్త భవనాలు కూడా మంజూరు చేసినట్లు తెలిపారు.
ప్రస్తుతం తండాలు అన్ని వసతులతో మోడల్ గ్రామాలుగా మారాయన్నారు. జిల్లా విద్యారంగంతోపాటు వ్యవసాయ రంగంలోనూ ముందంజలో ఉందన్నారు. ఇప్పుడిప్పుడే రైతులు మూసా పద్ధతి విడిచి నూతన ఒరవడిగా వ్యవసాయం వైపు ముందుకు సాగుతున్నారన్నారు. అలాగే ప్రభుత్వం గిరిజనుల ఆత్మగౌరవం కోసం వారి సామూహిక కార్యక్రమాలు, గిరిజన సమావేశాలను నిర్వహించుకోనేందుకు సేవాలాల్ మహరాజ్ భవన నిర్మాణాలను చేపట్టిందన్నారు. పోడుభూముల సమస్యలను పరిష్కరించేందుకు గతంలోనే చర్యలు చేపట్టిందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో శ్రావణ్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్‌చైర్మన్ వాకిటి శ్రీధర్, గిరిజన నాయకులు జయరాం, కృష్ణనాయక్, జాత్రునాయక్, సామ్యానాయక్, ధర్మనాయక్, నారాయణ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, గిరిజన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు.
వనపర్తి, ఫిబ్రవరి 19: ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణ అసెంబ్లీలో వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేలా ఏకగ్రీవ తీర్మానం చేసినందుకుగానూ, అందుకు సహకరించిన మంత్రి నిరంజన్‌రెడ్డిని వాల్మీకి ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాల్మీకుల డిమాండ్ నెరవేర్చేందుకు నావంతు కృషి చేశానని, మీరు ఉద్యమించాలనిన్నారు.
ఢిల్లీ కేంద్రంగా కూడా పోరాటం చేయాల్సి ఉంటుందన్నారు. అక్కడ కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల్లో తీర్మానం ఆమోదం పొందేలా కార్యాచరణ ప్రణాళికను రూపొదించుకోవాలని, బీఆర్ఎస్ ఎంపీలను కలవాలన్నారు. వనపర్తిలో వాల్మీకి కాంస్య విగ్రహం ఏర్పా టు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ వాకిటి శ్రీధర్, మాజీ కౌన్సిలర్ తిరుమల్, వాల్మీకి ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు వేణుగోపాల్‌నాయుడు, కురుమన్న, రాంమూర్తినాయుడు, నీలస్వామి, హరిశంకర్‌నాయుడు, పెంటన్న, విజయ్‌కుమార్, రవికుమార్‌నాయుడు పాల్గొన్నారు.