ఉమ్మడి జిల్లాలో రెండు రోజుల కిందటి వరకు రూ.220 ఉన్న చికెన్ ధరలు అమాంతంగా పడిపోయాయి. కార్తీకమాసం ఎఫెక్ట్‌తో ధరలు తగ్గగా.. చికెన్ ప్రియులకు పండుగలా మారింది. కానీ వ్యాపారులు మాత్రం ఢీలా పడిపోయారు. ధరలు పడిపోవడంతో కోళ్ల ఫారం యజమానులు గిట్టుబాటు కాకపోయినప్పటికీ వచ్చిన కాడికి విక్రయిస్తున్నారు.
గద్వాల, డిసెంబర్ 9 : చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కార్తీకమాసంతో చికెన్ ప్రియులకు అందుబాటులో ధరలు ఉండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల కిందటి నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.280 నుంచి రూ.300 వరకు ఉండేది. ఎన్నికల సమయంలో చికెన్, మటన్ ధరలకు పోటీ నెలకొంది. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతోపాటు కార్తీకమాసం ఉండడంతో అమాంతంగా ధరలు తగ్గిపోయాయి. గతంలో స్కిన్‌తో ఉన్న చికెన్ రూ.220 ఉండగా, ప్రస్తుతం రూ.145కి ధర చేరింది. స్కిన్లెస్ చికెన్ ధరలు గతంలో రూ.300వరకు ఉండగా, ప్రస్తుతం రూ.160 వరకు ధరలు ఉన్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో కార్తీకమాసం ముగియనుండడంతో మరోసారి చికెన్ ధరలు పెరిగే అవకాశమున్నది. కార్తీకమాసంలో చాలా మంది శివుడిని పూజించడం వల్ల కొంత మంది మాత్రమే మాంసహారాన్ని భుజిస్తారు. ఈ మాసంలో చికెన్ అమ్మకాలు నెమ్మదిస్తాయి. దీంతో కోళ్ల ఫారం యజమానులు తమ కోళ్లను దుకాణాలకు తక్కువ ధరకే విక్రయిస్తున్నా కొనేవారు లేరు. దీంతో కోళ్ల పెంపకందారులు, వ్యాపారస్తులు వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. కోళ్ల ఫారాలు నిర్వహించే యజమానులు కోళ్లను పెంచిన తర్వాత నిర్ణీత సమయంలో విక్రయించకపోతే నష్టపోయే ప్రమాదం ఉండడంతో ధర వచ్చినకాడికి విక్రయిస్తున్నారు. కార్తీకమాసం పూర్తయ్యే వరకు ఇటు వ్యాపారస్తులకు, అటు కోళ్ల పెంపకందారులకు గడ్డుకాలం ఉండనుండగా, చికెన్ ప్రియులకు మాత్రం చికెన్ చౌకగా లభిస్తున్నది.