మక్తల్, నవంబర్ 19 : మున్సిపాలిటీ నుంచి అందిన నోటీస్కు భయపడి చిరు వ్యాపారి ప్రాణాలు వదిలిన సంఘటన మక్తల్లో చోటు చేసుకున్నది. వివరాలిలా..
పట్టణంలోని మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలోని ప్రధాన రహదారి పక్కనే బాలమ్మ అనే వృద్ధురాలు కొన్నేండ్ల నుంచి కూరగాయలు విక్రయిస్తున్నది. అ యితే రోడ్డుపై చెత్తతోపాటు కుళ్లిన కూరగాయలు వేస్తున్నావంటూ కమిషనర్ భోగేశ్వర్, కార్యాలయ సహాయకుడు మంగళవారం ఉదయం ఆమెకు నోటీసులిచ్చారు.
రూ.200 జరిమానా చెల్లించాలని.. మరోసారి రోడ్డుపై అలాగే కుళ్లిన కూరగాయలు వేస్తే రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు జరిమానా వేస్తామని హెచ్చరించారు. అధికారి చెప్పిన మాటలకు కలత చెందిన వృద్ధురాలు విక్రయ కేంద్రం వద్దే కిందపడిపోయింది. స్థానికులు గమనించి వెంటనే స్థానిక ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లగా.. గుండెపోటుతో మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. పుర కమిషనర్ భోగేశ్వరను వివరణ కోరగా.. బాలమ్మ కూరగాయల వ్యాపారం చేస్తూ రోడ్డుపై మురిగిపోయిన కూరగాయలతోపాటు చెత్త వేస్తుండడంతో జరిమానా వేసి రసీదును అందించింది నిజమే అన్నారు. అంతేగానీ ఆమెను ఎలాంటి భయబ్రాంతులకు గురిచేయలేదన్నారు.