ఊట్కూర్ : కూలీ పనికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు ఇటుక గోడ కూలి (Wall collapse ) దుర్మరణం చెందిన ఘటన శనివారం నారాయణపేట జిల్లా( Narayanapet District) ఊట్కూర్ మండలంలోని కొల్లూరు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్సై కృష్ణంరాజు ( SI Krishnamraju) కథనం మేరకు సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మాల శంకరప్ప (55) , గ్రామానికి చెందిన మంగలి లక్ష్మికి చెందిన పాత ఇంటి గోడను కూల్చేందుకు కూలి పనికి వెళ్లాడు.
గోడను కూల్చే క్రమంలో ప్రమాదవశాత్తు కూలి పడడంతో తల, శరీర భాగాలు చిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పెద్ద సంఖ్యలో చేరుకొని శిథిలాలను తొలగించారు. అప్పటికే శంకరప్ప మృతి చెందడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై కృష్ణంరాజు గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట జిల్లా దవాఖానకు తరలించారు. నిరుపేద కూలి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.