పెద్దమందడి, మార్చి 08: ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పూరి గుడిసె దగ్ధమైన సంఘటన శనివారం నాగర్ కర్నూల్ జిల్లా పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామవాసి నక్క అంజనమ్మ నివాసం ఉండే గుడిసెలో శనివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ అయి నిప్పు అంటుకుంది. ఈ సంగతి గమనించిన చుట్టుపక్కల వాసులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో గుడిసె పూర్తిగా దగ్ధమైంది. అంజనమ్మ మేకలను మేపుకోవడానికి పొలానికి వెళ్ళింది. ఆమె కుమారుడు మేకలు కొనుగోలు చేయడానికి పెబ్బేరు సంతకు వెళ్లినట్లు తెలిపారు. ఇంట్లో మేకలు తెచ్చుకునేందుకు రూ.2 లక్షలు ఉంచినట్లు బాధితురాలు వాపోయారు. రూ.2లక్షల నగదుతోపాటు బియ్యం, సామాన్లు, బట్టలు కాలి పోయాయని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయమై గ్రామస్తులు తహశీల్దార్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ను పంపుతానని తహశీల్దార్ చెప్పారన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆడుకోవాలని గ్రామస్తులు కోరారు.