భూత్పూర్, జనవరి 11 : రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందగా ముగ్గురికి గాయాలైన ఘటన భూత్పూర్ చౌరస్తాలో ఫ్లైఓవర్ బ్రిడ్జిపై చోటు చేసుకున్నది. ఎస్సై చంద్రశేఖర్ కథనం మేరకు హైదరాబాద్ చెందిన దంపతులు శేషయ్య(73), నవనీత(65) ఆదివారం మేడ్చల్‌లో కుమారుని వద్ద నుంచి తిరుపతిలో ఉన్న కుమార్తె వద్దకు కారులో బయలుదేరారు. ఈక్రమం లో భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రం సమీపంలోకి చేరుకోగానే బ్రిడ్జి పై వెళ్తుండగా వెనకాలే వేగంగా వస్తున్న కారు వీరి కారును ఢీకొట్టింది. దీంతో వీరి కారు రోడ్డు డీవైడర్‌ను బలంగా ఢీకొట్టింది.
దీంతో కారులో ఉన్న దంపతులు శేషయ్య, నవనీత అక్కడికక్కడే మృతి చెందారు. శేషయ్య రిటైర్డ్ ఆర్మీమెన్ అని తెలిసింది. కారులో సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే ఇంత పెద్ద ప్ర మాదం జరిగినట్లు ఎస్సై తెలిపారు. వెనుకాల ఢీకొట్టిన కారులో ఉన్న వ్యక్తులు సీట్ బెల్ట్ వేసుకున్నందు వల్ల ప్రాణపాయ స్థితి నుంచి బయటపడ్డట్లు తెలిపారు. ఆ కారు డ్రైవర్ పూర్ణచందర్రావు(తిరుపతి సమీపంలోని రేణికుంట), చంద్రారెడ్డి(బెంగుళూరు), శ్రీనివాస్‌రెడ్డి(బెంగుళూరు) ఈ ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని 108లో జిల్లా దవాఖానకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. ఇందుకు సంబందించి ఫిర్యాదు రాలేదని ఎస్సై తెలిపారు. రెండు కార్లు ఢీకొని రోడ్డుకు అడ్డంగా పడడంతో ఎస్సై అక్కడికి చేరుకొని కార్లను తొలగింపజేశారు.