నవాబ్‌పేట, ఏప్రిల్ 29 : మండలంలోని ఇప్పటూర్ ప్రాథమిక పాఠశాల కార్పొరేట్‌ను తలదన్నేలా రూపుదిద్దుకున్నది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనఊరు-మనబడి కార్యక్రమంతో జవసత్వాలను నింపుకొన్నది. ఒకప్పుడు అధ్వాన్నంగా ఉన్న పాఠశాల.. నేడు జిల్లాలోని పాఠశాలలకు తలమానికంగా మారింది. ఇప్పటూర్ ప్రాథమిక పాఠశాలను ప్రభుత్వం మొదటివిడుత మనఊరు- మనబడి కార్యక్రమానికి ఎంపిక చేసింది. అస్థవ్యస్థంగా మారిన పాఠశాల రూపురేఖలను మార్చివేసేందుకు సుమారు రూ.52లక్షలను మం జూరు చేసింది. పనుల నిర్వహణ బాధ్యతలను ఉపసర్పంచ్ రవికిరణ్‌కు అప్పగించారు. మేజర్, మైనర్ రిపేర్‌లో భాగం గా రూ.7లక్షల 5వేలతో పాఠశాల గోడలకు ప్లాస్టింగ్ చేయించారు. అలాగే కొత్తగా బండలు, కిటికీలు, డోర్లు బిగించారు. వర్షం నీరు లీక్ కాకుండా వాటర్ ప్రూఫ్ చేయించారు. అలాగే పాఠశాలలో విద్యుత్ సౌకర్యాన్ని మెరుగుపర్చారు. వైరింగ్, లైటింగ్, బల్బులు, ఫ్యాన్లు ఏర్పాటు చేయించారు. విద్యార్థులకు తాగునీటి వసతి కల్పించేందుకు కుళాయిలను ఏర్పాటు చేశారు. అలాగే రూ.22లక్షల 13వేలతో పాఠశాలకు ప్రహరీ నిర్మించారు. పాఠశాల ఆవరణలో మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించడంతోపాటు రూ.లక్షా 14వేల 161 వెచ్చించి తరగతిగదుల్లో గ్రీన్‌బోర్డులు ఏర్పాటు చేయించారు. రూ.8 లక్షల 12వేల 462తో విద్యార్థుల సౌకర్యార్థం డ్యుయల్డెస్క్ బెంచీలు సమకూర్చారు. రూ.6లక్షలతో పాఠశాలకు కలరింగ్ చేయించగా, రూ.5లక్షలతో ఉపాధ్యాయ బృందానికి ఫర్నిచర్, రూ.లక్షతో లైబ్రరీ ఏర్పాటు చేశారు. కలెక్టర్ ప్రత్యేక నిధులు రూ.2.5లక్షలతో పాఠశాల ఆవరణలో గ్రీనరీని ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. పాఠశాలలో చేపట్టిన పనులు పూర్తి కావడంతో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేతుమీదుగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాలలో చదువుతున్న 118మంది విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి, ప్రమాణాలతోకూడిన విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాల రూపురేఖలు మారాయి.
మనఊరు- మనబడి కార్యక్రమంతో మా ఊరు పాఠశాల పూర్తిగా మారిపోయింది. గతంలో పాఠశాల అధ్వాన్నంగా కనిపించేది. ఇప్పుడు సకల హంగులతో తీర్చిదిద్దారు. కార్పొరేట్ పాఠశాలల్లో లేని వసతులు సైతం ఇక్కడ కల్పించారు. మనఊరు-మనబడి కార్యక్రమానికి మా పాఠశాలను ఎంపిక చేసిన ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.
–దుబ్బ రవికిరణ్, ఉపసర్పంచ్, ఇప్పటూర్
అందరి సహకారంతో అభివృద్ధి
గ్రామంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజల సహకారంతో పాఠశాలను తీర్చిదిద్దుకోవడం జరిగింది. విద్యార్థులకు అన్ని వసతులు కల్పించడంతోపాటు మెరుగైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అందరూ సహకరించాలి.
– కోళ్ల నర్సింహులు, హెచ్ఎం, ఇప్పటూర్