Mahabubnagar | మహబూబ్ నగర్ కలెక్టరేట్, జూన్ 1 : స్కూల్ బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్లు రెన్యూవల్ చేయించుకునే విషయంలో ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలల యాజమాన్యాలు నిరాసక్తంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 75 శాతం స్కూల్ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోలేదు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1888 స్కూల్ బస్సులు ఉన్నాయి. కాగా వాటిలో ఇప్పటి వరకు కేవలం 335 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు రెన్యువల్ చేయించారు. 1043 బస్సులకు ఇంతవరకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు రెన్యూవల్ చేయలేదు.
విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి పదిరోజుల వ్యవధి ఉంది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు ఇబ్బడి ముబ్బడిగా ప్రకటనలు చేస్తూ విద్యార్థులను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. గల్లిగల్లి తిరుగుతూ, తమ విద్యా సంస్థల గురించి ప్రచారం చేస్తున్నాయి. విద్య పేరు చెప్పి రూ.లక్షలు దండుకోవాలన్న ధ్యాస తప్పా విద్యార్థులకు తగిన భద్రత కల్పించాలన్న ఆలోచన విద్యా సంస్థల యాజమాన్యాలకు లేదన్న విమర్శలున్నాయి. ఇదే నేపథ్యంలో పిల్లల చదువుల కోసం ఎంత ఖర్చుకైనా తల్లిదండ్రులు వెనుకాడటం లేదు. విద్యా సంస్థల్లో వసతులు, బోధన సిబ్బంది గురించి ఆరా తీస్తారు. కాని వాటికంటే ముఖ్యమైన విషయం రవాణా సౌకర్యం గురించి పెద్దగా పట్టించుకోవడంలేదు. పాఠశాలల హంగులు, ఆర్భాటాలు చూసి మోసపోయే ప్రమాదముంది. జిల్లాలో స్కూల్ బస్సుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అనేక కార్పోరేటు, ప్రైవేటు పాఠశాలల బస్సుల్లో సీట్లు చిరిగిపోయి, దుమ్ము ధూళి పేరుకుపోయి, ఫస్ట్ ఎయిడ్ బాక్సుల్లో మందులున్నా లేకపోయినా.. ఉన్న మందులు కాస్తా గడువు తేదీ దాటిపోయినా పట్టించుకోకుండా లాభార్జన చూసుకుంటున్నాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందలాది పాఠశాలల్లో ఇదే పరిస్థితి, డబ్బులు వసూళ్లు చేయడంలో ఉన్న శ్రద్ద.. ప్రమాణాలు పాటించడంలో చూపించడం లేదు. వీరికి ఇటు విద్యాశాఖాధికారులు, అటు రవాణా శాఖాధికారులు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిట్నెస్ లేని కారణంగా గతంలో ఎన్నో చోట్ల విద్యార్థులు ప్రమాదాలకు గురైన ఘటనలు ఉన్నాయి. విద్యార్థులను క్షేమంగా ఇంటికి చేర్చే విద్యా సంస్థల బస్సు ఫిట్నెస్, అనుభవజ్ఞులైన డ్రైవర్లు, నిబంధనల మేరకు వాహనం ఉందా అన్నది తల్లిదండ్రులు చూడాలి. బస్సు డ్రైవరు బాధ్యతాయుతంగా విద్యార్థులను క్షేమంగా ఇంటికి చేర్చుతున్నారా అనే అంశాలను పాఠశాల యాజమాన్యం పరిగణనలోకి తీసుకోవాలి.
ఉమ్మడి జిల్లాలో స్కూల్ బస్సుల ఫిట్నెస్ ఇలా
మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 472 బస్సులు ఉండగా వాటిలో 107 బస్సులు మాత్రమే ఫిటినెస్ సర్టిఫికెట్లు పొందాయి. నాగర్కర్నూల్ జిల్లాలో 273 బస్సులకు కేవలం 50 బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో 244 బస్సులకు గాను 53 బస్సులకు, వనపర్తి జిల్లాలో 242 బస్సులకు 70, నారాయణపేట జిల్లాలో 152 బస్సులకు 55 బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉన్నాయి.
పట్టుబడితే వాహనాలు సీజ్
విద్యాసంస్థల ప్రారంభం ఈనెలో 12 లోగా బస్సులన్నింటినీ సామర్థ్య పరీక్షలు చేయించాలి. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. తనిఖీలు ముమ్మరం చేస్తాం. పట్టుబడితే వాహనాలను సీజ్ చేయడంతో పాటు జరిమానా విధిస్తాం. పరీక్షలకు రాని బస్సులకు సంబంధించి యజమానులకు నోటీసులు పంపిస్తాం. తల్లిదండ్రులు సైతం కచ్చితంగా బడి బస్సు గురించి వాకాబు చేయడంతో పాటు వాటి సమగ్ర వివరాలు సేకరించాకే విద్యార్థులను ఆయా పాఠశాలల్లో చేర్పించాలి. నిబంధనలు పాటించని పాఠశాలల్లో ఆడ్మిషన్లు పొందకూడదు.
– కిషన్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉప రవాణాశాఖ అధికారి