మక్తల్, జూన్ 10 : ఎగువ ప్రాంతం నుంచి కృష్ణానదికి వరద వస్తుండడంతో నదిలో నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతున్నది. మూడు రోజుల నుంచి వరద నిలకడగా వస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కృ ష్ణానది నుంచి దిగువకు నీరు రాకుండా అడ్డుకునేందుకు కర్ణాటక రాష్ట్రం రాయిచూర్ జిల్లా బీర్జాపూర్ వద్ద రోడ్కం బ్యారేజీ నిర్మించారు. అయితే ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో సోమవారం బీర్జాపూర్ బ్యారేజ్ గేట్లు తెరవడానికి అధికారులు ప్రయత్నించినప్పటికీ గేట్లు మొరాయించాయి. దీంతో వరద నీరు షట్టర్లపై నుంచి సిల్ప్వే ద్వారా దిగువకు వస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో మరో రెండు మూడు రోజుల్లో కృష్ణమ్మకు వరద పోటెత్తే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.
జూరాలకు..
ధరూరు, జూన్ 10 : ఎగువన కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. సోమవారం ప్రాజెక్టుకు 3,806 క్యూసెక్కులు వస్తున్నది. గతేడాది జూన్ మొదటి వారానికి ప్రాజెక్టులో 4 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 1.229 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఆర్డీఎస్కు..
అయిజ, జూన్ 10 : కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్ఫ్లో కొనసాగుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలకు సోమవారం 6,658 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉండగా, అవు ట్ ఫ్లో 6,658 క్యూసెక్కులు దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నట్లు ఆర్డీఎస్ ఏఈ రాందాస్ తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 8.8 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
తుంగభద్ర డ్యాంకు..
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు స్వల్పంగా వరద పెరుగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు సోమవారం ఇన్ఫ్లో 4,550 క్యూసెక్కులు ఉండగా, ఎనిమిది క్యూసెక్కుల అవుట్ ఫ్లో నమోదైంది. టీబీ డ్యాం 100.855 గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 4.581టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. 1,633 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టానికి గానూ ప్రస్తుతం 1,580.23 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు.