మహబూబ్‌నగర్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ ఆలయానికి మహర్దశ చేకూరనున్నది. పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకొని ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు విడుదల చేశారు. దీంతో రాష్ట్రంలో ఏ దేవాలయానికి లేని రోప్‌వే సౌకర్యాన్ని కల్పించనున్నారు. అద్భుతమైన పార్కు, భక్తులకు ప్రత్యేక వసతి గృహాలు, దశావతారాలను ఏర్పాటు చేయనున్నారు. రూ.15 కోట్లతో హరిత రెస్టారెంట్ నిర్మించనున్నారు. ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారిని నాలుగు లేన్లుగా మార్చి డివైడర్లు, పచ్చని మొక్కలు, లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు.
‘తీరితే తిరుపతి.. తీరకపోతే మన్యంకొండ’ అని తిరుమలకు వెళ్లలేని భక్తులు మన్యంకొండకు వెళ్లి స్వామివారికి దర్శించుకుంటే తిరుమలకు వెళ్లినట్లేనని ఉమ్మడి జిల్లాలోని భక్తుల న మ్మకం.. పేదల తిరుపతిగా పేరుగాంచి న మన్యంకొండ ఆలయానికి మహర్దశ పట్టనున్నది. తెలంగాణలోనే ఏ దేవాలయానికి లేని రోప్‌వే సౌక ర్యం మన్యంకొండలో ఏర్పాటు చే యాలని భావిస్తున్నారు. ఈ మేర కు పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చొరవతో ఆలయ అభివృద్ధికి రూ.50కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో రోప్‌వేతోపాటు మన్యంకొండలో అద్భుతమైన పార్కు, భక్తులకు ప్రత్యేక వసతి గృహాలు, దశావతారాలను ఏర్పాటు చేయనున్నారు. రూ.15కోట్లతో హరిత రెస్టారెంట్ నిర్మించనున్నారు. మహబూబ్‌నగర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్నందున భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకునేలా అభివృద్ధి చేస్తున్నారు. ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారిని నాలుగు లేన్లుగా మార్చనున్నారు. కొండపైకి నేరుగా వాహనాలు వెళ్లేందుకు ఎక్కేదారి, దిగేదారిని వేర్వేరుగా నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇటీవల ఆలయ అభివృద్ధికి రూ.50కోట్లు మంజూరు కావడంతో అభివృద్ధి చేపడుతున్నామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రకటించారు. యాదాద్రి తరహాలో మన్యంకొండ అభివృద్ధి చెందుతుండటంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలోనే తొలి రోప్‌వే
తమిళనాడులోని పళని సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు రోప్‌వే ఏర్పాటు చేశారు. అదే తరహాలో మన్యంకొండ దేవస్థానానికి కూడా రోప్‌వే ఏర్పాటు చేయాలని మంత్రి ప్రతిపాదించారు. దీంతో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రోప్‌వే నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. రోప్‌వే పూర్తయితే తెలంగాణలోనే ఇది తొలిరోప్వే అవుతుందని మంత్రి తెలిపారు. వృద్ధులు, పిల్లలు, మహిళలకు మేలు కలుగుతుంది.
రూ.15కోట్లతో టూరిజం హోటల్
మన్యంకొండ ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ టూరిజం హోటల్ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఆధునిక వసతులతో హోటల్ నిర్మాణం పూర్తయితే దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎంతగానే ఉపయోగపడుతుంది. ఇప్పటికే బ్రహ్మోత్సవాలు, ఏడాది పొడవున జరిగే ఇతర కార్యక్రమాలకు ఇక్కడ బస చేయాలంటే ఎలాంటి వసతులు ఉండేవి కావు. గతంలో పాత వసతిగృహాలు ఉండేవి. 18గదులతో వసతి సముదాయాన్ని ఇటీవల ప్రారంభించారు. భక్తులు ఇక్కడే ఉండి మొక్కులు చెల్లించుకునేందుకు ఉపయోగపడుతుందని భక్తులు అంటున్నారు.
ఆహ్లాదం.. ఆధ్యాత్మికం
ఉమ్మడి జిల్లాలో అత్యధిక జనాధరణ కలిగిన మన్యంకొండ ఆలయం దేవాదాయ, ధర్మాదాయశాఖ పరిధిలో ఏ గ్రేడ్‌లో ఉన్నది. ఏటా లక్షలమంది భక్తులు దర్శించుకునే ఆలయానికి అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారిని నియమించారు. ఆదాయంలోనూ నెంబర్‌వన్‌గా ఉన్న ఆలయాన్ని తెలంగాణ ఏర్పడ్డాక కొత్తరూపు సంతరించుకుంటున్నది. ఇప్పటికే ఆలయ పరిసరాల్లో కోనేరును ఆధునీకరించారు. కొండపై ఏర్పాటు చేసిన ఏడుకొండల నామాల లైటింగ్ సదూర ప్రాంతాల వరకు కనిపిస్తుంది. కల్యాణకట్ట, వసతిగృహాలను కొత్తగా నిర్మించారు. అన్నదాన సత్రానికి కొత్త భవనం నిర్మిస్తున్నారు. ఆలయ పరిసరాల్లోని కొండమీద పెద్ద పార్కు ఏర్పాటు చేస్తున్నారు. పార్కులో దశావతారాలు ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నారు. ఆహ్లాదభరితంగా ఉండేలా పార్కు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రధాన రహదారి నుంచి నాలుగు లేన్ల రహదారి పనులు కొనసాగుతున్నాయి. కొండవరకు రహదారిని ఆధునీకరించి రోడ్లమధ్యలో డివైడర్లు, పచ్చని మొక్కలు, లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు.
దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతా ..
మహబూబ్‌నగర్ జిల్లాలోని మన్యంకొండ క్షేత్రాన్ని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతా. తిరుమలకు వెళ్లలేని భక్తులు మన్యంకొండకు వస్తుంటారు. మునుల కొండగా పిలువబడే మన్యంకొండకు తిరుమలకు ఉన్న ప్రాశాస్థ్యం ఉన్నది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రిని అభివృద్ధి చేయడంతో ఆధ్యాత్మిక ప్రదేశంగా మారింది. ఇక్కడ కూడా భక్తులకు అన్ని వసతులు కల్పించి అభివృద్ధి చేసేందుకు రూ.50కోట్లు తీసుకొచ్చాం. తెలంగాణలోనే తొలిరోప్వే నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయి.
– శ్రీనివాస్‌గౌడ్, పర్యాటక, ఎక్సైజ్‌శాఖ మంత్రి