ఆత్మకూరు, ఆగస్టు16: జూరాలలో ఈ ఏడాది జూన్ 9న విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. ముందుగా ఎగువ జూరాల ప్రారంభించిన పిదప దిగువ జూరాలలో విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. ఆగస్టు12 వరకు కొనసాగిన విద్యుదుత్పత్తికి అప్పుడప్పుడు అవాంతరాలు కలిగాయి. ఎగువ నుంచి వరద ఉధృతి అధికంగా వచ్చిన కారణంతో అవాంతరం కలిగిందే కాని వరద లేక కాలేదు. ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టిన పరిస్థితుల్లో ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లో ఈనెల 12న విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. సోమవారం మళ్లీ జూరాల ప్రాజెక్ట్‌కు స్వల్పంగా వరద వస్తుండడంతో అధికారులు విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. ఎగువ, దిగువ జూరాలలో రెండు, రెండు యూనిట్లను వినియోగంలోకి తీసుకొచ్చారు. దీంతో ఎగువ జూరాల జలవిద్యుత్ కేంద్రంలో రెండు యూనిట్లతో 0.413 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరుగింది. దిగువ జూరాలలో రెండు యూనిట్లతో 0.459 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని నిర్వహించారు. దాదాపు 14వేల క్యూసెక్కుల నీటితో విద్యుదుత్పత్తిని నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది జూలై 14న సీజన్ ప్రారంభం కాగా నవంబర్ 11వరకు విద్యుదుత్పత్తి కొనసాగింది. ఈ ఏడాది నెల రోజుల ముందే వరద వచ్చినప్పటికీ ఉత్పత్తి రెండు నెలలకే పరిమితమైంది.
184మిలియన్ యూనిట్ల ఉత్పత్తి
ఈ ఏడాది 66రోజుల పాటు సాగిన సీజన్లో 42రోజుల పాటు విద్యుదుత్పత్తి కొనసాగింది. మొత్తంగా 184మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది. ఎగువ జూరాలలో 89మిలియన్ యూనిట్లు ఉత్పత్తి జరుగగా, దిగువ జూరాలలో 95మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. గతేడాది దాదాపు నాలుగు నెలలపాటు కొనసాగిన సీజన్లో ఎగువ జూరాల జలవిద్యుత్ కేంద్రంలో 370 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి జరుగగా, దిగువ జూరాలలో 405 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది. గతేడాది జరిగిన విద్యుదుత్పత్తి ఈ ప్రాజెక్టుల్లో ఆల్‌టైమ్ రికార్డ్‌గా నమోదైంది.