మహబూబ్‌నగర్‌టౌన్, జనవరి 12 : జిల్లా కేంద్రం జాతీయస్థాయి క్రీడా సంబురానికి వేదికకానుంది. నేటినుంచి మహబూబ్‌నగర్ క్రీడా మైదానంలోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 16వ తేదీ వరకు 2వ ఫెస్ట్ 5 సీనియర్ నేషనల్ మహిళా, పురుషుల నెట్‌బాల్ చాంపియన్‌షిప్ జరగనున్నది. దాదాపు నాలుగేండ్ల తరువాత జాతీ య క్రీడలు జరుగుతున్నాయి. నాలుగు రోజులపాటు పట్టణ ప్రజలను కనువిందు చేయనున్నాయి. జిల్లా నెట్‌బాల్ అధ్యక్ష, కార్యదర్శులు ఆదిత్యరెడ్డి, ఖాజాఖాన్ ఆధ్వర్యంలో టోర్నీ నిర్వహణకు ఏర్పాటు చేశారు. మహిళా క్రీడాకారులకు ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్, పురుషులకు చైతన్య స్కూల్, లిటిల్‌స్కాలర్స్ స్కూల్లో బస కల్పిస్తున్నారు. బీపీహెచ్ఎస్లో భోజన వసతి కల్పిస్తున్నారు.
2వ ఫెస్ట్ 5 సీనియర్ నేషనల్ మహిళా, పురుషుల నెట్‌బాల్ చాంపియన్‌షిప్ దేశవ్యాప్తంగా 28 రాష్ర్టాల నుంచి 720 మంది క్రీడాకారులు తలపడనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, బీహర్, చత్తీస్గడ్, చండీఘడ్, ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానా, హిమచల్‌ప్రదేశ్, జమ్ముకాశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహరాష్ట్ర, మణిపూర్, నాగలాండ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ జట్లు పాల్గొనున్నాయి. నెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలను శనివారం సాయంత్రం 4గంటలకు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. నెట్‌బాల్ డెవలప్మెంట్ కమిటీ ఇండియా చైర్మన్ హరిఓం ప్రకాశ్కౌశిక్, నెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ విజేందర్‌సింగ్, రాష్ట్ర ప్రతినిధులు, జిల్లా ప్రతినిధులు ప్రముఖులు హాజరుకానున్నారు.
తెలంగాణ ఫెస్ట్ 5 పురుషుల జట్టు : విక్రమాదిత్యరెడ్డి, ఇస్మాయిల్, హరీశ్, శ్రావణ్, ప్రకాశ్, సాయికృష్ణ, అంజయ్య, విహరి, అభిసాయి, సాయిప్రణీత్.
మహిళా జట్టు : మౌనిక, సమిత, అకిల, గౌతమి, మేఘన, నవ్యతేజశ్రీ, శిజాని, అనన్య, అలోన, వైష్ణవి జట్టులో ఉన్నారు.