
మహబూబ్నగర్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా కారణంగా అన్ని రంగాలు నిర్వీర్యమయ్యాయి. ఆర్థికంగా పలు రంగాలు దెబ్బతిన్నాయి. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రైవేట్ రంగాల్లో వర్క్ ఫ్రం హోం విధానంతో వేతనాలు కూడా తగ్గిపోయాయి. ఇక బోధనారంగంలో ఉద్యోగాలు పోయిన వారి సంఖ్య ఎంతో ఉన్నది. రియల్ ఎస్టేట్పై ఆధారపడిన వారి పరిస్థితి దయనీయం. అయితే, కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో దాదాపు అన్ని రంగాలు క్రమంగా కోలుకుంటున్నాయి. వ్యాపారాలు తిరిగి గాడిన పడ్డాయి. నిర్మాణ రంగం పుంజుకుంటున్నది. సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు తెరిచేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యారంగం కూడా తిరిగి పూర్వవైభవం సంతరించుకునే అవకాశాలు మెరుగయ్యాయి. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ సైతం గాడిన పడుతున్నది. ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో భారీగా రిజిస్ట్రేషన్లు జరిగాయి.
ఉమ్మడి జిల్లాలో రూ.11.72 కోట్ల ఆదాయం..
గత నెల 22వ తేదీ నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ప్లాట్లు, బిల్డింగుల రిజిస్ట్రేషన్ విలువనూ పెంచింది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం క్రమంగా పెరుగుతున్నది. కరోనా ప్రభావం క్రమేపీ తగ్గుతుండడంతో రిజిస్ట్రేషన్లు సంఖ్య పెరుగుతున్నాయి. ఈ నెల 1 నుంచి 25వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 5,724 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరగగా.. రూ.11,72,82,000 స్టాంప్ డ్యూటీగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ఇప్పటికే వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లన్నింటినీ తాసిల్దార్లకు అప్పగించగా.. కేవలం ప్లాట్లు, బిల్డింగుల రిజిస్ట్రేషన్ ద్వారా మాత్రమే ఇంత ఆదాయం రావడం విశేషం. లాక్డౌన్ సమయంలో రిజిస్ట్రేషన్లు లేక అల్లాడిన జనం ఇప్పడు క్రమంగా రిజిస్ట్రేషన్లకు వస్తున్నారు. ధరణి ప్రారంభం తర్వాతే భూముల రిజిస్ట్రేషన్లన్నీ తాసిల్దార్ కార్యాలయాలకు మారాయి. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద కేవలం ప్లాట్లు, బిల్డింగులు, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతున్నాయి. దీంతో స్టాంప్ డ్యూటీ పెరిగినా గతంతో పోలిస్తే ఆదాయం తగ్గిందని అధికారులు చెబుతున్నారు.
లింక్ డాక్యుమెంట్లు ఉంటే మాత్రమే..
ప్రభుత్వ నిబంధనల మేరకు అనుమతి ఉన్న డీటీసీపీ లేఅవుట్లకు మాత్రమే అధికారులు రిజిస్ట్రేష న్ చేస్తున్నారు. ఇక గతంలో రిజిస్ట్రేషన్ అయి, లింక్ డాక్యుమెంట్లు ఉన్న ప్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసేందుకు అంగీకరిస్తున్నారు. అనుమతి లేని లే అవుట్లకు రిజిస్ట్రేషన్ చేసేందుకు నిరాకరిస్తున్నారు.
అనధికార లేఅవుట్లకు నో రిజిస్ట్రేషన్..
ప్రభుత్వ నిబంధనల మేరకు అనుమతి లేని లే అవుట్లు రిజిస్ట్రేషన్ చేయబడవు. అయితే గతంలో రిజిస్టర్ అయిన లింక్ డాక్యుమెంట్లు ఉంటే మాత్రం నిబంధనల మేరకు అంగీకరిస్తాం. ప్రజలు తప్పనిసరిగా అన్ని అనుమతులు ఉన్న ప్లాట్లనే కొనుగోలు చేయాలి. క్రమంగా రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరుగుతున్నది. కరోనా వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వాళ్లు ఎక్కువ సేపు వేచిచూడకుండా ఉండాలనుకుంటే స్లాట్ బుకింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి.