మహబూబ్‌నగర్ అర్బన్, జూన్ 25 : ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాలు కడుతున్న బ్యారేజీలు, రిజర్వాయర్లతో తెలంగాణ రైతాంగానికి మరణ శాసనమే మిగులుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వరెడ్డితో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఒకటై నీరు తీసుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని, దీంతో భవిష్యత్‌లో పాలమూరు జిల్లాకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. కర్ణాటక నావలి వద్ద 50 టీఎంసీ బ్యారేజీ పనులు ప్రారంభమయ్యాయి. ఇదే కాకుండా.. తుంగభద్ర నది పొడువునా రోడ్ కం.. బ్రిడ్జీలు, రిజర్వాయర్లు కడుతూ అక్కడ నీరు నిలుపుకొనే విధంగా పనులు చేపడుతున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ గుండ్రేవుల వద్ద మరో 20 టీఎంసీ రిజర్వాయర్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేస్తుందని ఇది పూర్తి అయితే శ్రీశైలం, తుమ్మిళ్లకు నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. కర్ణాటక గేట్లు పునరుద్ధరిస్తే రేవంత్‌రెడ్డి సర్కార్‌కు ఏం ప్రయోజనం కలిగిందో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. కర్ణాటక పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌తోపాటు మంత్రులకు హెలిక్యాప్టర్‌లో కర్ణాటక ప్రభు త్వం చేపడుతున్న బ్యారేజీలు, రిజర్వాయర్ పనులు కనిపించలేదా? అని ప్రశ్నించారు. అక్రమంగా చేపడుతున్న బ్యారేజీలు, రిజర్వాయర్లు ఇతర పనులు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పోయి మీరు చూసిన ప్రాజెక్టును అడ్డుకోకుంటే ఉమ్మడి పాలమూ రు జిల్లా రైతులు మరోసారి వలసపోయే పరిస్థితి ఏర్పడనుం దన్నారు.
ఆర్డీఎస్కు 100 మీటర్ల దూరంలో బ్యారేజ్ కడుతుంటే ప్రభుత్వంలో స్పందనలేదని విమర్శించారు. ఇవి పూర్తి అయితే తుంగభధ్ర నుంచి శ్రీశైలంకు నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా పోతుందన్నారు. కృష్ణా నీళ్లను కూడా తరలించుకొని వేళ్లేందుకు కుట్ర జరుగుందని, బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు వ్యతిరేకంగా పనులు జరుగుతుంటే ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి తెలంగాణ రైతులను ముంచడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మేము చెప్పిం ది అవాస్తవం అని చెపితే దేనికైన సిద్ధం అన్నారు. కర్ణాటక నీళ్ల మంత్రి వచ్చి ఉమ్మడి జిల్లా శాసనసభ్యులతో సమావేశం పెడితే కొందరు జిల్లా ఎమ్మెల్యేలు కర్ణాటక ప్రతిపాదనను వ్యతిరేకిస్తే.. మిగితావాళ్లు మౌనం వహించారన్నారు. దీనిపై అందరు కలిసి వ్యతిరేకించకుంటే రైతులకు నష్టం చేసినవాళ్లు అవుతారని తెలిపారు.
ఆధ్రంప్రదేశ్లో పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి నీటిపారుదాల శాఖ సలహాదారుగా నియమించుకున్నారు, ఇక్కడి నీళ్లను తరలించేందుకు మా ర్గం సుగమం చేశారు. ఆర్డీస్ వద్ద విధులు నిర్వహిస్తు న్న ఇంజినీరింగ్ అధికారులను ఆంధ్రప్రదేశ్‌కు చెంది న నేతలు, అధికారులు బెదిరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా చేస్తే మూల్యం చెల్లించుకోవలసి వస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలతో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అందరం కలిసిమెలిసి ఉంటాం. కొందరు ఆం ధ్రప్రదేశ్‌కు చెందిన నాయకులు తెలంగాణకు అన్యా యం చేస్తామంటే ఊరుకునేదే లేదని, తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కొందరు నాయకులు తెలంగాణ మీ అయ్య జాగిరా.. అని అంటున్నారు.
అవును.. బరాబర్ తెలంగాణతో పాటు మహబూబ్‌నగర్ కూడా మా అయ్య జాగిరే అన్నారు. ఇక్కడి మేధావులలో ఒకరైన ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసు పెట్టా రు ఆయనను ముట్టుకొని చూడండి ఏం జరుగుతుం దో తెలుస్తుందన్నారు. తెలంగాణ ప్రాంతానికి నీటి పారుదల రంగంలో ఆదిత్యనాథ్ న ష్టం చేస్తే ఆయనను కూడా వదిలిపెట్టం.. చట్ట ప్రకా రం చర్యలు తీసుకుంటామన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో చర్చించి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న బారేజీలు, రిజర్వాయర్లపై పోరాట ప్రణాళిక విడుదల చేస్తామన్నారు. తెలంగాణ రైతాంగానికి నష్టం చేస్తే ప్రత్యక్షంగా రైతులను కల్పుకొని పోరాటాలు చేస్తామన్నారు. జిల్లా కేంద్రంలోని స్టేడియం అభివృద్ధికి మా హయాంలో నిధులు ఇచ్చి జీవో కూడా జారీ చేశామని, వాటిని ఇటీవల క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారని గుర్తు చేశా రు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మెహన్‌రెడ్డి మాట్లాడుతూ కొడంగల్ ప్రాజెక్టు వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని,మక్తల్ నియోజకవర్గం మూడు మండలాలకు నష్టం కలిగించి కొడంగల్‌కు నీరు తరలించేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. ఒకమీటర్ లోతులో పైపులైన్ ద్వారా నీళ్లను తీసుకెళ్లేందుకు పనులు జరుగుతున్నాయని, భవిష్యత్‌లో నీళ్ల ఒత్తిడికి పైపులు పగిలిపోవడం ఖాయమని పేర్కొన్నా రు. ఊట్కూర్ వాగులో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని ప్రత్యక్షంగా పరిశీలించి చెప్పడంతోపాటు అధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, కార్పొరేటర్లు ఈశ్వరయ్య, రమేశ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.