మహబూబ్‌నగర్, మార్చి 27, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తిరు కల్యాణపు బొట్టును పెట్టి.. మణి బాషికాన్ని నుదుట కట్టి.. పారాణిని పాదాలకు పెట్టి.. పెండ్లి కూతురుగా సీతమ్మ కల్యాణ వేదికపై కొలువు దీరగా.. సంపగి నూనెను కురులకు దువ్వి.. సొంపుగా కస్తూరి నామం దిద్ది.. చెంపన వాసి చుక్కను పెట్టి.. పెండ్లి కొడుకుగా రామయ్య కొలువు దీరగా.. నవమి మూహుర్తాన.. అభిజిత్ లగ్నంలో వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మేళతాళాల చప్పుళ్ల మధ్య.. సీతమ్మ మెడలో రామయ్య మాంగల్యధారణ చేయగా.. ఆణిముత్యాలే తలంబ్రాలుగా మెరిసిన సీతారాముడి కల్యాణ ఘట్టం వైభోవంగా సాగింది. రాములోరి కల్యాణాన్ని భక్తజనం కనురెప్ప వాల్చకుండా వీక్షించి పులకించిపోయారు.
మదిలో శ్రీరాముని నామస్మరణతో పరవశించిపోయారు.. ‘జగదభిరామా.. జానకి రామా’.. ‘జై శ్రీరామా.. జైజై శ్రీరామా’ అంటూ స్వామిని స్మరించుకొని పునీతులయ్యారు. ఇలా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతి ఊరూ.. వాడా రామయ్య కల్యాణ వేదికలుగా మారాయి. సీతారాముల ఉత్సవ మూర్తులను రథంపై, పల్లకీలో ఉంచి ఊరేగించారు. ఈ సందర్భంగా రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, జైపాల్ యాదవ్, నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తోపాటు మంత్రి జూపల్లి, ఎమ్మెల్యేలు, ఎంపీ, అధికారులు పాల్గొన్నారు.