ఇప్పుడు గ్యాస్ సమస్య వచ్చిందని కాదు! ఆ ఇంట్లో రెండేండ్లుగా పొయ్యి వెలగలేదు. నూనె మసలలేదు. ఏ పాకంలోనూ మసాలాలు కలవలేదు. నానబెట్టిన అటుకులే వారికి అన్నం. నూరుకున్న కాయగూరలే కూరలు. పిండి వంటలు, బేకరీ ఐటమ్స్, స్వీట్స్ అన్నీ ఆ ఇంట్లో తయారవుతాయి. కానీ, పొయ్యి మండదు. ఇడ్లీ, దోశ, ఉప్మా, గారె, బూరె అన్నీ భలేగా వండేస్తుంది పరిమి లక్ష్మి. బట్ నో ఆయిల్.. నో బాయిల్! అరవై ఏళ్లు దగ్గరకు వచ్చినా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారామె! పాతిక మారథాన్లు పూర్తి చేసి ఆర్గానిక్ లేడీగానే కాదు ఐరన్ లేడీగానూ పేరు తెచ్చుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
ఆహార నియమాలు పాటిస్తుంటే చూసేవాళ్లు.. వీరికి ఏదైనా అనారోగ్య సమస్య ఉందేమో అనుకుంటారు. నాకు ఏ సమస్యా లేదు. ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యకరమైన నియమాలు పాటిస్తున్నాను అంతే. ఇరవై ఏళ్ల నుంచి ఆర్గానిక్ ఫుడ్ తింటున్నాను. రోజూ గంటపాటు యోగా చేస్తాను. ఇప్పుడు నాకు 57 ఏండ్లు. ఏ అనారోగ్య సమస్యా లేదు. మా వారికి కొలెస్ట్రాల్ కొద్దిగా పెరిగింది. మోకాళ్ల నొప్పులు వచ్చాయి. దానిని తగ్గించుకోవడానికి ‘నో ఆయిల్’ అనుకున్నాను. మనం ఆయిల్ వాడేది బాయిల్ చేయడానికే కదా. అందుకే నో ఆయిల్ అంటే నో బాయిల్ అన్నట్టే! రెండేళ్లుగా ఈ పద్ధతిని అమలు చేస్తున్నాను. అప్పటి నుంచి వెగాన్గానే ఉంటున్నాను. మా ఆయన కూడా ఇప్పుడు ఫిట్‌గా ఉన్నారు. ఆయన చిన్నప్పుడు అథ్లెట్ కాదు. రిటైర్ అయిన తర్వాత ఆయన మారథాన్ పరుగు పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ మధ్యే ముంబై మారథాన్‌లో నలభై రెండు కిలోమీటర్లు పరిగెత్తారు. చాలా మారథాన్లు పూర్తి చేశారు. ఆయనతోపాటు నేనూ మారథాన్లలో పాల్గొన్నాను.
మా ఇంట్లో పొయ్యి వెలుగదు. అసలు ఆ అవసరమే రాదు. రుచుల కోసం కాదు ఆరోగ్యం కోసం తినాలని మా కోరిక. అలాగని పచ్చి కూరగాయలు, పండ్లు తింటూ కడుపు నింపుకొంటున్నామని భావించొద్దు. అందరూ ఇళ్లల్లో తినే వంటలే మేమూ తింటాం. అవే వండుకుంటాం. నూనె వాడకుండా, పొయ్యి మీద ఉడికించకుండా వంటలు చేస్తాను. ఇది విన్న వాళ్లు ఎవరూ నమ్మరు. చూస్తే నమ్మకుండా ఉండలేరు!
అందరిళ్లల్లో వండుకున్నట్టే మేం పొద్దున ఇడ్లీ, ఉప్మా, లెమన్ రైస్, జీరా రైస్, పులిహోరా ఇవన్నీ చేసుకుంటాం. అలాగే అన్ని రకాల కూరలూ వండుకుంటాం. స్వీట్స్, బేక్స్ చేసుకుంటాం. పిండివంటలు కూడా చేసుకుంటాం. కానీ, వేటికీ నూనె వాడం. వేడి చేయం. అటుకులు నానబెట్టిన తర్వాత వాటిని వడకడతాను. అదే మాకు అన్నం. దానిని కూరలేకుండా పొద్దున టిఫిన్‌గా తినాలనుకుంటే ఉసిరికాయ తరిగి కలిపితే ఉసిరికాయ అన్నంలా తయారవుతుంది. కొద్దిగా కాల్చిన పల్లీలు కలుపుకొంటాం. ఈ అటుకుల అన్నంలో నిమ్మకాయ పిండి, పల్లీలు కలుపుకొంటే లెమన్ రైస్ రెడీ. ఇలాగే మామిడికాయ చద్ది చేసుకుంటాం.

నూనె కలపకుండా, ఉడికించకుండా ఏ వెజిటబుల్ అయినా వంట చేసుకోవచ్చు. కూరలు కూడా తొందరగా వండుకోవచ్చు. ఖర్చు తక్కువ. కూరల్లో కొబ్బరి పాలు వాడతాను. కొబ్బరి పాలలో కావాల్సిన నూనె ఉంటుంది. కాకపోతే ఉడికించను. అన్నీ పచ్చివి కలుపుతాను. బెండకాయలు కోసి, ఉప్పు కలిపి పక్కన పెట్టుకుంటాను. ఓ అయిదు నిమిషాలు ఉంచితే మగ్గిపోతుంది. ఆ తర్వాత కొబ్బరి, కొద్దిగా పచ్చి మిర్చి నూరి కలిపితే కూర రెడీ అవుతుంది. ఏ కూరగాయలైనా తరిగిన తర్వాత ఉప్పు కలిపితే చాలు మగ్గినట్టుగా మారిపోతాయి. వాటికి పచ్చి కొబ్బరితోపాటు రుచి కోసం మిర్చి కలుపుకోవచ్చు. అటుకుల్లో మిరియాలపొడి చల్లి, ఉల్లిపాయలు కోసి కలుపుకొంటే మిరియాల పోహా రెడీ అవుతుంది. తమలపాకులు, టమాటా, కొబ్బరి వేసి చట్నీ చేసుకోవచ్చు. ఉలవలతో బూరెలు చేస్తాను. మెలకలను, బీట్రూట్ని కలిపి మిక్సీ పట్టుకుని వడలు చేసుకుని ఆరబెడితే భలే రుచిగా ఉంటాయి! మునగాకు, పల్లీపొడి, కొబ్బరి కలిపి రుబ్బుకున్న తర్వాత వాటిని వడల్లా చేసి ఆరబెట్టుకుంటే కాసేపటికి తినడానికి రుచిగా తయారవుతాయి. పసుపు, జీడిపప్పు, కొబ్బరి కలిపి లడ్డూలు చేసి అందరికీ ఇచ్చాను. ‘బందరు లడ్డూనా?’ అనడిగారు. ఇలా కావాల్సిన వంటల్ని రోజూ తయారు చేసుకుంటాను. టమాటా, కొత్తిమీర, కొబ్బరి పాలతో రసం చేస్తాను. రుచి కోసం అదనంగా నిమ్మరసం కలుపుకోవచ్చు. పచ్చి మిర్చీ మిక్సీ పట్టి కలుపుకోవచ్చు.
బేకరీ వంటకాలైతే ఎండబెడతాను. ఓట్స్‌లో బెల్లం కలిపి బిస్కెట్లు తయారు చేస్తాను. గోధుమ పిండిలో బెల్లం కలిపి ఓవెన్లో పెట్టుకుంటే డోనట్స్ తయారవుతాయి. పండ్లరసాలతో ఐస్‌లు, ఐస్‌క్రీమ్‌లు తయారు చేసుకుంటాను. వంటలు చేసుకునేది రుచి కోసమే. రుచిగా ఉంటే తింటాం. రుచులకు అలవాటు పడ్డాం కాబట్టి వేరేవి తినం. కానీ, ఆహారానికి సహజంగానే రుచి ఉంటుంది. పోపు వేస్తేనే, నూనెలో ఉడికిస్తేనే, మసాలాలు కలిపితేనే రుచి ఉంటుందనుకోవద్దు. ఉడికించకుండానూ ఆహారపదార్థాలను కలపడం ద్వారా రుచి రాబట్టుకోవచ్చు. నేను రోజూ అదే చేస్తాను. అందుకే అందరూ నన్ను ఆర్గానిక్ లేడీ అంటారు. ఎవరైనా అతిథులు వస్తే మా ఆహార అలవాట్లతో సర్దుకోలేరు. కాబట్టి వాళ్ల కోసం వంటలు చేస్తాం.

మా అబ్బాయి మారథాన్లకు వెళ్లేవాడు. ఎనిమిదేళ్ల క్రితం.. తనతోపాటు మమ్మల్నీ తీసుకెళ్లాడు. మొదట రెండు కిలోమీటర్లు పరిగెత్తాం. ఇప్పుడు ఏకబిగిన పది కిలోమీటర్లు పరిగెత్తుతున్నాను. మా ఆయన 42 కిలోమీటర్లు పరిగెత్తుతున్నారు. అహ్మదాబాద్, ముంబై, నాగపూర్, హైదరాబాద్ మారథాన్లలో పాల్గొన్నాను. ఇప్పటి వరకు ఇరవై అయిదు రన్నింగ్ ఈవెంట్లలో పాల్గొన్నాను. విజయవంతంగా పది కిలోమీటర్ల పరుగు పూర్తిచేశాను. మారథాన్ ఈవెంట్లలో పరిగెత్తాలంటే ఫిట్నెస్ ఉండాలి. అలాగే ప్రాక్టీస్ ఉండాలి. నెక్లస్ రోడ్లో ప్రతి రోజూ సైక్లింగ్ చేస్తాను. ట్యాంక్ బండ్‌పై ఉదయం అయిదు కిలోమీట్లరు పరిగెత్తుతాను. మారథాన్లు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ దూరం ప్రాక్టీస్ చేస్తాను.
మా ఆయన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లో మేనేజర్. మూడేళ్లకు ఒకసారి తనకు బదిలీ అయ్యేది. మా ఆయన చదువుకోమన్నారు. నాకూ చదువంటే ఇష్టం. కానీ, ఇంటి పని, మా వాడి స్కూలింగ్ నేనే చూసుకునేది. అందువల్ల చదువుకోవడానికి అవకాశం లేకుండాపోయింది. మా బాబు పెద్దవాడయ్యాడు. ఆంధ్రా యూనివర్సిటీలో బీఏ ఎల్ఎల్బీలో చేరాను. మా అబ్బాయి పదో తరగతి పాస్ అయినప్పుడు నా ఎల్ఎల్బీ పూర్తయింది. ఆ సమయంలోనే మావారికి అనంతపురం బదిలీ అయింది. అక్కడ జూనియర్ అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేశాను. అహ్మదాబాద్ (గుజరాత్)కి బదిలీ అయింది. అక్కడ ఎల్ఎల్ఎంలో చేరాను. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ట్రెడిషనల్ నాలెడ్జ్ పేటెంట్స్ మీద పరిశోధన చేసి డాక్టరేట్ తెచ్చుకున్నాను. ఏజ్ బార్ అయిపోయింది. ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ రాయడానికి అర్హత లేదు. ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా న్యాయ శాస్ర్తాలు చదువుతున్నాను. అవే పాఠాలు చెబుతున్నాను. గుజరాత్లో నిర్మా యూనివర్సిటీలో అధ్యాపకురాలిగా పని చేశాను. హైదరాబాద్‌లోని అన్వర్ ఉలూం కాలేజ్‌లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, పేటెంట్ సబ్జెక్టులు చెబుతున్నాను. పాతికేళ్లుగా న్యాయవిద్యే నా ప్రపంచం!