గురువారం 03 డిసెంబర్ 2020
Mahabubnagar - Oct 31, 2020 , 01:47:57

భక్తిశ్రద్ధలతో మిలాద్‌ ఉన్‌ నబీ

భక్తిశ్రద్ధలతో మిలాద్‌ ఉన్‌ నబీ

  • మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు 
  • రక్తదానం చేసిన యువకులు

మహబూబ్‌నగర్‌ టౌన్‌ : మహ్మద్‌ ప్రవక్త జన్మదినా న్ని పురస్కరించుకొని శుక్రవారం మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మసీదుల్లో జాగరణ చేశారు. ‘ఖురాన్‌' ‘హదీస్‌' గ్రంథాల్లోని దైవ సందేశాలను మత పెద్దలు విశ్లేషించి ధర్మ బోధనలు చేశారు. ప్రవక్త జీవిత విశేశాల గురించి వివరించారు. అదేవిధంగా ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేయించారు.  వివిధ మదర్సాల్లో విద్యార్థులకు ధార్మిక ప్రసంగాలు, నాతే షరీఫ్‌ పోటీలు నిర్వహించారు. వేడుకలను పురస్కరించుకొని యువజన ధార్మిక సం ఘాల ఆధ్వర్యంలో పలుచోట్ల అన్నదానం, రక్తదానం కార్యక్రమాలను నిర్వహించారు. మగ్రిబ్‌ నమాజ్‌ అనంతరం షాషాబ్‌గుట్ట దర్గాలో  కౌరంపేట మదర్సా, జామియా నిజామియాకు చెందిన ప్రముఖ ధార్మికవేత్త  మౌలానా మహ్మద్‌ తస్లీమ్‌ అన్సారీ ధార్మిక సందేశం ఇచ్చారు.

శుభాకాంక్షలు తెలిపిన  మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి

మిలాద్‌ ఉన్‌ నబీని పురస్కరించుకొని ముస్లింలకు ఎక్సై జ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహ్మద్‌ ప్రవక్త చూపిన మార్గాన్ని అందరూ అనుసరించాలని వారు సూ చించారు. అదేవిధంగా మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, వైస్‌ తాటి గణేశ్‌ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. 

జడ్చర్ల పట్టణంలో..

జడ్చర్లటౌన్‌ : పట్టణంలో ముస్లింలు మిలాదున్నబీ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ జాగరణ చేశారు. ఈ సందర్భంగా మసీదుల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా పట్టణంలోని నిమ్మబావిగడ్డ జమా మసీదు నుంచి కావేరమ్మపేట అంజుమన్‌ పాఠశాల వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న వారికి పండ్లు అందజేశారు. కావేరమ్మపేటలోని అంజుమన్‌ పాఠశాలలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 74 మంది యువకులు రక్తదానం చేశారు. అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ముస్లింలు భక్తిశ్రద్ధలతో మిలాదున్నబీ వేడుకలను జరుపుకొన్నారు.

భూత్పూర్‌ మండలంలో..

భూత్పూర్‌ : మండలంలోని పలు గ్రామాల్లో మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పురపాలక సంఘంలోని జామ మసీద్‌లో ప్రార్థనల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జామ మసీద్‌ కమి టీ సభ్యులు ఖాదర్‌, ఖాదీర్‌, సాబేర్‌, అప్సర్‌, ఆర్టీఏ ఖాదర్‌, అక్తర్‌ పాల్గొన్నారు.

మిడ్జిల్‌ మండలంలో..

మిడ్జిల్‌ : మండల కేంద్రంతోపాటు, బోయిన్‌పల్లి, వాడ్యాల్‌, వేముల, వల్లభురావుపల్లి, రాణిపేట, చిల్వేర్‌, మసిగుండ్లపల్లి తదితర గ్రామాల్లో మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మసీద్‌ల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.