నాగర్‌కర్నూల్, డిసెంబర్ 12 : అమాయకులను, వితంతువులను నమ్మించి మోసం చేయడమే కాకుండా 11హత్యలు చేసిన మాంత్రికుడు రామటి సత్యనారాయణ అలియాస్ సత్యంయాదవ్ అలియాస్ సత్యనారాయణస్వామిని నాగర్‌కర్నూల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు జోగులాంబ గద్వాల డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ ఎస్పీ కార్యాలయంలో విలేకరుల ముందు నిందితుడిని హాజరుపరిచారు. నిందితుడు నాగర్‌కర్నూల్ జిల్లాలోనే కాకుండా ఇతర రాష్ర్టాల్లోనూ పలు హత్యలు చేసి అంతరాష్ట్ర హంతకుడిగా మారినట్లు వెల్లడించారు. ఈమేరకు డీఐజీ చౌహాన్ సత్యనారాయణ పేరుమోసిన హంతకుడిగా పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన గోవుల వెంకటేశ్‌తోపాటు 11మంది అమాయకులను కిరాతకంగా హతమార్చినట్లు పేర్కొన్నారు. ఇతని నుంచి మృతిచెందిన వ్యక్తులకు చెందిన 5సెల్ఫోన్లు, నిందితుడు ఉపయోగించిన 8 సెల్ఫోన్లు, 10 సిమ్‌కార్డులు, టీఎస్ 31సీ 3689 నెంబర్ గల షిఫ్ట్ కారు, విషపూరితమైన పదార్థాలను కలిగిఉన్న పెట్టెలు, సీసాలు, 5 ఎలక్ట్రికల్ డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్‌కు చెందిన బాలికతోపాటు ముగ్గురు వ్యక్తులు, నాగర్‌కర్నూల్ పీఎస్ పరిధిలో ఇద్దరు, కొల్లాపూర్ పీఎస్ పరిధిలో ఒకరు, కల్వకుర్తి పీఎస్ పరిధిలో ఒకరు, కర్ణాటక రాష్ట్రంలోని బలగనూరు పీఎస్ పరిధిలో ఓ మహిళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం లల్లా పెద్దవడుగూరు పీఎస్ పరిధలో ఒకరిని హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు డీఐజీ వెల్లడించారు. గుప్తనిధులు తవ్వకాల పేరుతో అమాయక ప్రజలను మోసం చేసి నమ్మిన వారి నుంచి ప్లాట్లు కానీ, భూములు కానీ రిజిస్ట్రేషన్ చేయించుకునేవాడన్నారు. ఈక్రమంలో తన పని ముగిశాక వారిని వశపరుచుకొని ఏకాంతంగా ఉన్న చోటికి పిలిపించుకొని హత్య చేసేవాడని వెల్లడించారు. పూజలు చేస్తూ తీర్థం పేరుతో వారి నోట్లో యాసిడ్ లేక విష పదార్థాలు పోసి చంపేవాడన్నారు. నిందితుడు ఇప్పటి వరకు ఇక చిన్నారి, మహిళలతోసహా మొత్తం 11 మందిని చంపినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్ణాటకలో 8 కేసుల్లో అతని పాత్ర ఉన్నట్లు గుర్తించామన్నారు. హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌కు చెందిన గోవుల వెంకటేశ్ తాను నాగర్‌కర్నూల్‌లో రామటి సత్యనారాయణ వద్దకు వెళుతున్నానని చెప్పి ఐదురోజులైనా తిరిగి రాకపోవడంతో ఆమె ఫిర్యాదు మేరకు చేపట్టిన విచారణలో సత్యంయాదవ్ గుట్టు రట్టయ్యిందని డీఐజీ తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్న సత్యంయాదవ్ తాతల నాటి నుంచి మూలిక వైద్యం ద్వారా క్షుద్రపూజలు నేర్చుకొని పరంపర ఇలాంటి హత్యలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు.
మృతుడు గోవుల వెంకటేశ్, అతడి స్నేహితులు కొల్లాపూర్‌లో గుప్తనిధి కోసం ప్రయత్నిస్తూ సత్యంయాదవ్ను సంప్రదించారు. గుప్త నిధిని కనుగొని వెలికితీసే ప్రక్రియలో మరణించే వ్యక్తి తనను సంప్రదించాలని సత్యంయాదవ్ షరతుపెట్టాడు. దీంతో వెంకటేశ్, అతడి స్నేహితుడు అందుకు అంగీకరించా రు. నిధిని పొందడానికి ముగ్గురు గర్భిణులను వధించాలని చెప్పాడు. దీంతో వెంకటేశ్ భయాందోళనకు గురై తన డబ్బులు తనకు ఇవ్వాలని సత్యంయాదవ్ను అడగడంతో మరో ఉపాయం ఉందని నచ్చజెప్పి గతనెల 3వ తేదీ నాగర్‌కర్నూల్‌కు వెంకటేశ్‌ను రప్పించాడు. సత్యంయాదవ్ ముందుగానే వేసుకున్న పన్నాగం ప్రకారం వెంకటేశ్ సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి మరుసటిరోజు 4వ తేదీన జిల్లేడు పాలు, మరికొన్ని మూలికలతో విష ద్రావణాన్ని పూజ పేరుతో తీర్థం తాగించాడు. వెంకటేశ్ అపస్మారక స్థితికి వెళ్లాక కారులో జలాల్పూర్ గ్రామ శివారులోకి తీసుకెళ్లి నోటిలో యాసిడ్‌పోసి పరారయ్యాడు. సమీపంలోని పొదల్లో చొకా, పర్సు పడేసి నాగర్‌కర్నూల్‌కు చేరుకున్నాడు. మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఐజీ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అదనపు ఎస్పీ రామేశ్వర్, డీఎస్పీ మోహన్‌కుమార్, సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్సై మహేందర్ ఉన్నారు.