వనపర్తి, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : ఆగస్టులో భారీగా వర్షాలు కురవాల్సి ఉండగా.. వరుణుడు ము ఖం చాటేశాడు. వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నె లకొన్నది. జూన్లో వానకాలం ప్రారంభమై ఆగస్టులో భారీ వరదలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ, ప్రస్తుతం నీటి నిల్వలు ఎక్కడా కనబడడం లేదు. పూర్తి స్థాయిలో ఎండాకాలాన్ని తలపిస్తున్నది. ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా 24 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండగా, గరిష్ఠంగా 34 డి గ్రీలు నమోదవుతున్నది. ఇదే పరిస్థితి కొనసాగితే పంటలకు, పశువులకు ఇబ్బందికరంగా మారనున్నది. సాగునీటి ఆధారిత పంటలైన వరి, మొక్కజొన్న, ఉద్యాన పంటలతోపాటు వర్షాధారిత పంటలైన కంది, పత్తి పంటకు వర్షాలు సకాలంలో కురవకపోవడంతో తెగుళ్లు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వానకాలం ఆరంభంలో జూన్, జూలైలో సగటుతో పోలిస్తే వర్షం కాస్త ఫర్లేదనిపించినా.. ఆగస్టులో ఎప్పుడూ లేనంత తక్కువ వర్షపాతానికి పడిపోయింది.
వనపర్తిలో అత్యల్పం..
అత్యధిక వర్షపాతం కురిసే వనపర్తి జిల్లాలో ఈ ఏడాది ఆగస్టులో అత్యంత తక్కువ వర్షాలు కురిసినట్లు జిల్లా వాతావరణ శాఖ తెలిపింది. సగటున 107 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా, ఆగస్టులో కేవలం 12.7 మి.మీ. మాత్రమే కురిసింది. పాన్గల్ మండలంలో 75.3 మి.మీ. కురవాల్సి ఉండగా, కేవలం 22 మి.మీ.కే పరిమితమైంది. వీపనగండ్లలో సగటున 117.4 మి.మీ. ఉండగా, 38.6 మి.మీ., చిన్నంబావిలో 117.4 మి.మీ.కు 28.4 మి.మీ., ఖిల్లాఘణపురంలో 101.4 మి.మీ.కు 33.4 మి.మీ. మాత్రమే కురిసింది. జిల్లాలో సగటున 93.7 మి.మీ. కురువాల్సి ఉండగా, 34.3 మి.మీ. కురిసింది. సగటుకన్నా 63 మిల్లీమీటర్లు తక్కువ. ఇప్పటికే భారీ వర్షాలతో కుంటలు, వాగులు పొంగిపొర్లాల్సి ఉన్నప్పటికీ.. జూన్, జూలైలో కురిసిన వర్షపు నీరు, ఎగువ నుంచి వచ్చిన వరదతో పంట పొలాలకు నీళ్లందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువులు నిండడంతో పంటపొలాలకు సాగు నీరు అందుతున్నది.
కానీ తక్కువ వర్షపాతం కారణం గా యాసంగి పంటకు సాగునీటి కొరత ఏర్పడే ఉండే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.