
నవాబ్‌పేట, ఆగస్టు 8 : ఉదండాపూర్ రి జర్వాయర్ పనుల చాటున కొందరు గుట్టుచప్పుడు కాకుండా ఇసుక అక్రమ దందా కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టు పనుల శివారు గ్రామాల్లో మట్టిని తీసుకువచ్చి ఎవరికీ అనుమానం రాకుండా ఇసుకను ఫిల్టర్ చేసి నయా దందాకు తెరలేపారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కారుకొండ, శ్యామగడ్డ తండా, జడ్చర్ల మండలం ఖానాపూర్ గ్రామాల శివారుల్లో రెండేండ్ల నుంచి ఉదండాపూర్ ప్రాజెక్టు పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇదే అదునుగా భావించిన కొందరు టిప్పర్ల యజమానులు ఇసుక దందాకు తెరలేపారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ప్రతిరోజూ 20-30 టిప్పర్ల ఇసుకను ప్రాజెక్టుల పనుల చాటున ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రాజెక్టు పను ల్లో చాలా వాహనాలు ఉండటంతో ఎవరికీ అనుమానం రాకుండా అక్రమార్కులు ఈ తతంగానికి ఒడిగట్టారు. పక్కనే ఉన్న రైతు ల పొలాల్లో మట్టిని తవ్వి వారికి నయానో.. బయానో అప్పజెప్పి పట్టపగలే దందా చేపడుతున్నారు. అక్రమ దందా కొనసాగే ప్రాం తం నవాబ్‌పేట, జడ్చర్ల మండలాల శివారుల్లో ఉండటంతో అక్రమార్కుల దందాకు మరింత లాభం చేకూరుతున్నదని తెలుస్తున్నది. రెండు మండలాల అధికారులు మీరా..మేమా అనే మీమాంసలో ఉండటం తో వ్యాపారులకు ఇష్టారాజ్యంగా మారింది. స్థానిక రైతులు ఎవరైనా అడ్డు తగిలితే బెదిరింపులకు దిగుతున్నారని వాపోతున్నారు. ప్రాజెక్టు పనులు చేయించే అధికారులను సైతం బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొంటున్నారు. దీనిపై నవాబ్‌పేట ఎస్సై శ్రీకాంత్‌ను వివరణ కోరగా, ప్రాజెక్టు పనుల్లో ఇసుక దందాపై సత్వరమే దర్యాప్తు చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.