
మహబూబ్‌నగర్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పీఆర్ఎల్ఐ రెండో ఫేజ్ కెనాల్ ఏర్పాటుపై మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ ఎంపీపీ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. 90 టీఎంసీల వరద నీటిని 60 రోజులపాటు ఐదు దశల్లో ఎత్తిపోసి ఆరు రిజర్వాయర్లను నింపడం ద్వారా సాగు, తాగునీటి సౌకర్యం కల్పించేందుకుగానూ చేపట్టిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ విజయవంతంగా ముగిసింది. కలెక్టర్ ఎస్.వెంకట్రావు అధ్యక్షతన రైతులు, రైతు సమాఖ్య ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, రిటైర్డ్ ఇంజినీర్లు అభిప్రాయాలు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ప్రాజెక్టు ఆవశ్యకతను అధికారులకు వివరించారు. సమైక్య రాష్ట్రంలో అన్యాయానికి గురైన పాలమూరు గురించి తెలిపారు. చెంతనే కృష్ణా, తుంగభద్ర నదులున్నా తాగు, సాగు నీటికి పడిన గోసను వివరించారు. వందల కి.మీ. దూరంలో ఉన్న మద్రాసుకు తాగునీటిని అందించేందుకు ఉత్సాహం చూపించిన సమైక్య పాలకులు నదిని ఆనుకుని ఉన్న పాలమూరు వాసుల దూప తీర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీశైలం, జూరాల, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టుల కింద రైతులు భూములు త్యాగం చేసినందుకే ఇప్పుడు సాగునీళ్లు వస్తున్నాయని, అందుకే పాలమూరు బీడు భూముల్లోకి కృష్ణా జలాలు వచ్చి సస్యశ్యామలం అయ్యేందుకు స్వచ్ఛందంగా అంగీకరిస్తున్నట్లు రైతులు తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడించిన అభిప్రాయాలను కలెక్టర్ ఆధ్వర్యంలో ఆడియో, వీడియో రూపంలో రికార్డు చేశారు. వీటన్నింటినీ ప్రభుత్వానికి పంపనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పీఆర్ఎల్ఐ వంటి ప్రాజెక్టు నిర్మించే సమయంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయడం సర్వసాధారణమన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవర్, కె.సీతారామారావు, ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు, పీఆర్ఎల్ఐ ఎస్ఈ నరసింగరావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం.దయానంద్, ఇతర ఇంజినీరింగ్ అధికారులు, ఆర్డీవో పద్మశ్రీ, తాసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో ధనుంజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
వలసలు తగ్గుముఖం పడతాయి..
నీటి ఆవకశ్యత లేని కారణంగా కేవలం వర్షాధారాన్ని నమ్ముకొని పంటలను పండిస్తున్నాం. దీంతో పెట్టుబడి కూడా రాని పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఎంతో మంది మహారాష్ట్ర, గుజరాత్ వంటి ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి అయితే కాలువల ద్వారా సాగునీరు అందనున్నది. వలసలు తగ్గుముఖం పడుతాయి. ప్రపంచానికి అన్నం పెట్టే రైతుల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ చేసిన, చేస్తున్న కృషి అమోఘం. ముఖ్యంగా అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టు చేపట్టడం అభినందనీయం.
అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలి..
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు వచ్చిన వెంటనే పనులు పూర్తి చేసి పాలమూరు జిల్లాను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలి. రిటైర్డు ఇంజినీర్ల బృందం విశేష కృషి ఉన్నది. ఈ ప్రాజెక్టుతో పాలమూరు జిల్లా మరో కోనసీమగా మారడం ఖాయం. రాబో యే తరానికి బహుమానంగా భావిస్తున్నాం. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో జిల్లా సస్యశ్యామలం అవుతుంది. కాళేశ్వరం మాదిరిగానే ఈ ప్రాజెక్టులో డిస్ట్రిబ్యూషన్ పైప్‌లైన్ ఏర్పాటు చేయాలి. భౌగోళికంగా ఎతైన ప్రాంతంలో ఉన్న నారాయణపేటకు లిఫ్టుల ద్వారా నీళ్లు తీసుకురావడం అభినందనీయం.
సాగుభూములుగా మారుతాయి..
దశాబ్దాలుగా బీడువారిన భూము లు పీఆర్ఎల్ఐ నిర్మాణంతో సాగులోకి వస్తాయి. ప్రాజెక్టులు లేకపోవడంతో వర్షాధారం పైనే పంటలసాగు కొనసాగేది. నీరు సమృద్ధిగా లేకపోవడంతో పంటలు ఆశించిన మేర దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలయ్యేవాళ్లం. ఒక్క పంటతోనే కాలం గడిచేది. పీఆర్ఎల్ఐ పూర్తైతే ఏటా రెండు, మూడు పంటలు సాగు చేస్తాం.
దశాబ్దాల కల నెరవేర్చండి..
దశాబ్దాల కల అయిన పీఆర్‌ఎల్‌ఐని వేగంగా పూర్తి చేసి తీరాలి. ప్రా జెక్టులతోనే అభివృద్ధి సాధ్యమవుతుం ది. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా చొరవ తీసుకుని ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. ప్రజలకు దినసరి, నెలసరి ఆదాయం తో పాటు ఈ ప్రాంతమంతా అభివృ ద్ధి చెందుతుంది. మత్స్యకారులకు ఉ పాధి లభిస్తుంది. పండ్లు, కూరగాయల సాగు పెరుగుతుంది.
నిధులు దోచుకుపోయారు..
సమైక్య రాష్ట్రంలో బక్కచిక్కిన పా లమూరు వలస కూలీల ఫొటోలు, నెర్రెలిచ్చిన భూములను ప్రపంచ బ్యాంకుకు చూపించి నిధులు తెచ్చుకొని సీమాంధ్రకు తరలించుకుపోయారు. కృష్ణానది నుంచి వందల కి.మీ. దూరంలో ఉన్న మద్రాసుకు తాగునీరు ఇవ్వడానికి వాళ్లకు మన సు వచ్చింది. కానీ, తాగునీటి కోసం గొంతెండి పోయిన పాలమూరు ప్రజల దాహార్తి వారికి కనిపించలేదు. సీఎం కేసీఆర్ మాత్రం మా కష్టాలు తీర్చేందుకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారు. మేమంతా మూకుమ్మడిగా ఈ ప్రాజెక్టుకు అంగీకరిస్తున్నాం.
పాలమూరుకు అన్యాయమే జరిగింది..
700 కి.మీ. ప్రవహించి సముద్రంలో కలిసే కృష్ణానది ఒక్క పాలమూరు జిల్లాలోనే 300 కి.మీ. ప్రవహిస్తుంది. కానీ సమైక్య రాష్ట్రంలో ఈ ప్రాంతానికే తీవ్రమైన అన్యాయం జరిగింది. దగాపడిన పాలమూరుకు కేసీఆర్ పీఆర్ఎల్ఐతో న్యాయం చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ మాదిరిగా అనుమతులు లేకుండా అభిప్రాయ సేకరణ లేకుండా అడ్డగోలుగా ప్రాజెక్టులు చేపట్టడం లేదు. అన్నీ పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే రివర్స్ మైగ్రేషన్ ప్రారంభం అవుతుంది.
గతంలో చిన్న పనులు చేస్తుంటిమి..
సమైక్య రాష్ట్రంలో ఈఈగా పనిచేస్తున్నప్పుడు చిన్న చిన్న చెరువులు, కుంటల పనులు చేస్తుంటిమి. ఇప్పు డు ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణ పను లు చూస్తామని కలలో కూడా అనుకోలేదు. పాలమూరు ప్రాజెక్టు వల్ల చారిత్రక కట్టడాలకు ఎలాంటి స మస్య లేదు. వణ్యప్రాణులకు ము ప్పు లేదు. పర్యావరణానికి ఎలాంటి ఆపద లేదు. 90 టీఎంసీల నీటిని ఎత్తిపోసి ప్రాజెక్టు కడుతున్నామంటే ఎంతో సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి జిల్లాలో తాగు, సాగునీటి సమస్యలు తీరుతాయి.
లేబర్ జిల్లా అనే ముద్ర పోతుంది..
ప్రపంచమంతా నిర్మాణరంగంలో పాలమూరు కూలీలు పనిచేయడం తో లేబర్ జిల్లా అనే పేరు వచ్చింది. కృష్ణానది ప్రవహిస్తున్నా.. సమైక్య పాలకుల తీరు వల్ల తాగు, సాగునీరు లభించలేదు. నీళ్లు లేక పొట్టచేతపట్టుకుని ముంబై, పుణె వలసపోయే దు స్థితి వచ్చింది. 2014కు ముందు సా గునీరు కూడా లభించని పరిస్థితి ఉం డె. తెలంగాణ వచ్చాక తాగునీళ్లు వచ్చాయి. ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టుతో సాగునీటి గోస కూడా తీరుతుంది. వలసలు తగ్గిపోతాయి. ఇక లేబర్ జిల్లా అనే ముద్ర పోతుంది.
పాలమూరు ప్రాజెక్టు చూస్తామనుకోలేదు..
పాలమూరు ప్రాజెక్టు మా చిరకాల స్వప్నం. ఈ ప్రాజెక్టు పనులు మేం చూస్తామనుకోలేదు. ఇంత మంది అధికారులు వచ్చి ప్రాజెక్టు నిర్మాణానికి మా అభిప్రాయాలను సేకరణకు జిల్లా కేంద్రంలో కాకుండా ఎక్కువ భూములు పోతున్న మా హన్వాడలో నిర్వహించడం మా అదృష్టం. వెనకబడిన ఈ ప్రాంతం బాగుపడాలంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మించాల్సిందే. సాధ్యమైనంత త్వరగా పనులు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ బాగుపడాలని సీఎం కేసీఆర్ చాలా కృతనిశ్చయంతో ఉన్నారు.
రైతు కుటుంబాల్లో సంతోషం..
ప్రాజెక్టుల ని ర్మాణంతో పుష్కలంగా సాగునీరందుతుంది. ఏటా పంట ది గుబడులు అధికంగా వస్తాయి. దీంతో రైతు కుటుంబాలు సంతోషంగా జీవనం సాగిస్తా యి. సమైక్య రాష్ట్రలో సాగు నీరు లేక అన్న మో రామచంద్రా అని అలమటించిన అన్నదాతలు అన్ని విధాలా ఆర్థికంగా నిలదొక్కుకొని గర్వంగా నిలబడగలుగుతాడు. సీఎం కేసీఆర్ సార్‌కు ధన్యవాదాలు.
ఎలాంటి ముప్పు లేదు..
పీఆర్ఎల్ఐ నిర్మాణంతో పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉండదు. పీఆర్ఎల్ఐ ఫేజ్-2 కెనాల్ మార్గంలో ఎలాంటి చారిత్రాత్మక కట్టడాలు, గుడులు, అడవులు లేవు. దీంతో జంతువులకు, పక్షులకు, వాతావరణానికి ఏ మాత్రం హాని జరగదు. ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేస్తే ప్రజలకు తాగు, సాగు నీరంది ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది.
ఎనిమిదేండ్ల కృషి ఫలితం..
ఎనిమిదేండ్లుగా ఇరిగేషన్ రిటైర్డ్ ఇంజియర్ల బృందం పీఆర్ఎల్ఐ కోసం నిర్విరామంగా కృషి చేశారు. ఇలాంటి రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ వచ్చాం. నిజంగా ఈ రోజు పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ప్రజానీకానికి శుభదినం. 12.60 లక్షల ఎకరాలు సాగులోకి రావడం హర్షణీయం. నీళ్లు ఉంటేనే అన్నింటికీ ఆధారం. ప్రాజెక్టు ఏర్పాటుతో భూగర్భ జలాలు పెరుగుతాయి. ఈ బృహత్తర ప్రాజెక్టుకు అందరూ సహకరించాలి.