వనపర్తి, ఆగస్టు 6 : అగ్గిపెట్టెలో ఇమడగల చీరను త యారు చేసి దేశం పేరును ఖండాంతరాలకు ఎలుగెత్తి చా టిన ఘనత చేనేత కార్మికులకే దక్కుతుంది. ప్రపంచ వ్యా ప్తంగా మగువల మనసును దోచే చీరలను నేయడంలో వారికెవరూ సాటిలేరు. చేనేత వస్త్రాల తయారీకి వనపర్తి జిల్లాలో కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత పుట్టినిల్లు. ఏండ్ల తరబడిగా మగ్గాలపై వివిధ ఆకృతులు, డిజైన్లతో తయారుచేసిన చీరలు దేశ నలుమూలలకు చేరాయి. శుభకార్యాల సందర్భంగా మహిళలు చేనేత చీరలను కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. నేతన్నల కష్టాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ అందిస్తున్నది. ప్రభుత్వం అందజేస్తున్న రుణ సౌకర్యాన్ని అందిపుచ్చుకొని ఆర్థికంగా ఎదగాలని అధికారులు సూచిస్తున్నారు. నేతన్న తయారు చేసిన చీరలో హుందాతనం కనిపిస్తుంది. కాటన్‌తో నేసిన చీరలు మహిళలకు అందాన్ని తీసుకొస్తాయి. ఒక్కో చీర తయారీకి నెల నుంచి మూడు నెలల సమయం పడుతుందని కార్మికులు చెబుతున్నారు. వనపర్తి జిల్లాలో కాటన్, పట్టు, సీకో, పైథాని వంటి చీరలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది.
జాతీయ చేనేత దినోత్సవ నేపథ్యం..
మహాత్మా గాంధీ నాయకత్వంలో నిర్వహిస్తున్న జాతీయోద్యమంలో భాగంగా 1905 ఆగస్టు 7న కలకత్తా టౌన్హాల్లో స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. స్వదేశీ వస్తువులనే వాడాలి.. విదేశీ వస్తువులను బహిష్కరించాలని పిలుపు ఇచ్చారు. ఈ మేరకు విదేశీ వస్ర్తాలను దహనం చేశారు. ఆ రోజును స్ఫూర్తిగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 2015లో ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు నేడు జిల్లాలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.
వనపర్తిలో 1,200 మంది నేతన్నలు..
2017 సంవత్సరంలో కార్వే సంస్థ చేపట్టిన సర్వే ప్రకారం.. వనపర్తి జిల్లాలో సుమారు 403 మగ్గాలుండగా, 1,200 మంది నేతన్నలు ఉన్నారు. గుర్తించిన వారందరికీ సంస్థ ద్వారా మగ్గం నెంబర్లను కేటాయించడంతోపాటు వారి వివరాలను ఆన్లైన్లో పొందపరిచినట్లు అధికారులు వెల్లడించారు. చేనేత కార్మికులకు గత ప్రభుత్వాలు రూ.100 నుంచి రూ.500 వరకు పింఛన్ ఇవ్వగా, తెలంగాణ ప్రభుత్వంలో రూ.2016 అందుతున్నాయి. కాగా, అమరచింతలో చేనేత క్లస్టర్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.