ఆత్మకూరు, సెప్టెంబర్ 6 : ఆత్మకూరుకు 108 సేవలు దూరమయ్యాయి. దాదాపుగా 15 ఏండ్లుగా సేవలందిస్తున్న 108 వాహనం ఆరు నెలలుగా కనబడడం లేదు. మరమ్మతుకు నోచుకోక సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తున్నది. బ్రేక్‌డౌన్ కారణంగా పట్టించుకునే వారు లేకపోవడంతో 108 వాహనం కూత మూగబోయింది. దీంతో మండలంలో క్షతగాత్రులను రక్షించేందుకు అంబులెన్స్ సౌకర్యం లేకుండా పోయింది. ఆపదలో ఉన్న వారు గత్యంతరం లేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్ వాహనాన్ని ఆశ్రయించే స్థోమత లేని వారు ప్రాణాలమీదకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆత్మకూరులో 108 వాహనం లేకపోవడంతో చిన్నచింతకుంట, నర్వ మండలాల ప్రజలు కూడా అంబులెన్స్ సేవలకు దూరమయ్యారు. గతంలో నియోజకవర్గ కేంద్రంగా ఉన్నప్పటి నుంచి కొనసాగిన అంబులెన్స్ సేవలు ప్రస్తుతం నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం ఆరు నుంచి పది కేసులను నమోదు చేసుకుంటున్న అంబులెన్స్‌కు మరమ్మతులు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇతర ప్రాంతాల నుంచి రావాల్సిందే..
ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో అంబులెన్స్ అవసరమైతే కొత్తకోట మినహా మిగతా ప్రాంతాలన్నీ దాదాపు 30 నుంచి 35 కిలోమీటర్లు ఉంటాయి. కొత్తకోటలోని అంబులెన్స్ బిజీగా ఉన్నా.., ఆ వాహనం ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడేదైనా ఘటన జరిగినా.. ఏం చేయలేని దుస్థితి. ఒకవేళ మరికల్, గద్వాల, ధరూర్, పెబ్బేరు, దేవరకద్ర, వనపర్తి నుంచి అంబులెన్సులు వచ్చేసరికి ప్రమాదంలో ఉన్న వారి పరిస్థితి దయనీయంగా ఉంటుంది. 108 వాహనం 35 కిలోమీటర్ల దూరం వరకే పరిమితి ఉంటుంది. అత్యవసర చికిత్స కోసం వెళ్లాలనుకున్న వారు ప్రమాదస్థాయిని బట్టి వనపర్తి, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లకే ప్రాధాన్యమిస్తారు. ఒకవేళ 35 కిలోమీటర్ల నుంచి వచ్చిన వాహనం.. మరో 20 కి.మీ. దూరంలో కేసు తీసుకొని దవాఖాన కోసం మరో 35 కి.మీ. వెళ్లాలి. ఆ తరువాత పూర్వ స్థానానికి రావాలంటే 90 కిలోమీటర్లు వెనక్కి రావాల్సిందే. ఇలా అంబులెన్స్‌కు అధిక ఖర్చు, శ్రమ అవుతుందనేది నిపుణుల వాదన. అంబులెన్స్ సౌకర్యం లేక పలువురు మృత్యువాత పడిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఈనెల 2వ తేదీ వరకు ఆత్మకూరులోనే నిలిచిన వాహనాన్ని జీవీకే అధికారులు రాత్రికి రాత్రే కొత్తకోటకు తరలించారు. వాహనానికి మరమ్మతులు చేయించి సేవలు ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇబ్బందుల్లో రోగులు..
అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈనెల 2వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో బాధితుడు అంబులెన్స్ కోసం వేచి చూసినందున దవాఖానకు ఆలస్యంగా వచ్చాడు. ఈ కారణంగా మృతి చెందాడు. తిప్డంపల్లి బాధితుడి కుటుంబానికి ప్రైవేట్ వాహనం తీసుకెళ్లే స్థోమత లేక ఇక్కడే ప్రాణాలు వదిలాడు. అంబులెన్స్ అందుబాటులో ఉంటే వారు బతికేవారు. వాహనం లేని కారణంగా కేసులు రెఫర్ చేయడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి.
– డా.లక్ష్మణ్, ఆత్మకూరు
రెండ్రోజుల్లో సమకూరుస్తా..
ఆత్మకూరులో అంబులెన్స్ బ్రేక్‌డౌన్ కారణంగా నిలిచినట్లు తెలిసింది. ఇప్పటి వరకు సమస్య నా దృష్టికి రాలేదు. సంబంధిత అధికారులతో మాట్లాడి రెండ్రోజుల్లో అంబులెన్స్‌ను సమకూరుస్తాను. గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా ఆరు వాహనాలను ఎంపీ అందించారు. అందులో ఒక వాహనాన్ని ఆత్మకూరుకు తీసుకొస్తాం. – చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే