మాగనూరు (కృష్ణ), అక్టోబర్ 8 : స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. బుధవారం కృష్ణ మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి ‘కాంగ్రెస్ బాకీ’ కార్డులను ఇంటింటికి తిరిగి ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ 22 నెలల పాలనలో ఆరు గ్యారెంటీలు అమలు కావడం లేదని, ఎన్నికల ముందుకు ఇచ్చిన 420 హామీల ఊసే ఎత్తడం లేదన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని, గ్యారెంటీ కార్డులు దగ్గర పెట్టుకోవాలని, అమలుకాకపోతే తమను నిలదీయాలని రేవంత్‌రెడ్డి ఆ నాడు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీ కార్డుల ప్రకారమే ఎవరెవరికీ ఎంత బాకీ ఉన్నారో తెలిసేలా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ‘కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు’లను ప్రజలకు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ హామీలన్నీ సీఎం రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ దేశ నాయకులు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంకగాంధీ, మల్లికార్జునఖర్గేలు కూడా ఇచ్చారని, వీరంతా బాధ్యులేనని స్పష్టం చేశారు. వీటన్నింటిపై ప్రభుత్వాన్ని ఓట్లు అడగడానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ప్రజలు మాజీ ఎమ్మెల్యేతో మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ఓటు వేసి బుద్ధి తెచ్చుకున్నామని, అన్ని అబద్ధపు హామీలు ఇచ్చిన ఈ ప్రభుత్వాన్ని తగిన బుద్ధి చెప్తామని వెల్లడించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కృష్ణ మండలకేంద్రంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయగా అర్చకులు ఆయనను శాలువాకప్పి సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మాగనూరు మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు రాజుల ఆశిరెడ్డి, శివరాజ్ పాటిల్, ఈశ్వర్‌యాదవ్, చేగుంట శివప్ప, శంకర్‌నాయక్, మల్రెడ్డి, మోనేశ్, అమ్రేశ్, వెంకటేశ్, అంజి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.