మైలారం పలుగురాళ్లగుట్టపై మైనింగ్ మాఫియా ప్రకంపనలు సృష్టిస్తున్నది. నల్లమలను అనుసరించి ఉన్న ఆ గ్రామానికి గనులు శాపంగా మారాయి. పల్లెకు సమీపంలో ఉన్న గుట్టపై క్వార్ట్ ్జకోసం జరుగుతున్న తవ్వకాలతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. గుట్టను స్వాహా చేసేందుకు నిరంతరం తవ్వకాలు జరుపుతుండడంతో ఆందోళన బాట పట్టారు. అయినా వారి గోడును పట్టించుకోకుండా పనులు చేస్తుండడంతో ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి. తమ ప్రాణాలు పోయినా సరే మైనింగ్‌కు ఒప్పుకోమని తెగేసి చెబుతున్నారు. అయినా వినకపోవడంతో ప్రభుత్వం తీరును ఎండగడుతున్నారు.
– అచ్చంపేట/బల్మూర్, జనవరి 25
నల్లమలలో మైనింగ్ మాఫియా విధ్వంసం సృష్టిస్తున్నది. అడవిని నమ్ముకొని స్వేచ్ఛగా పశుపక్షాదులతో మమేకమై జీవనం సాగిస్తున్న పల్లెవాసులకు కంటిపై కునుకులేకుండా చేస్తున్నది. ఇంతకాలం పల్లెను నమ్ముకొని బతుకున్న జనం నెత్తిన మైనింగ్ కార్పొరేట్ కత్తి వెలాడుతోంది. నల్లమల అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాంతానికి ఆనుకొని రెండు కిలోమీటర్ల దూరంలోని బల్మూర్ మండలం మైలారం పలుగురాళ్లగుట్ట ఉన్నది. ఈ గుట్టను మైనింగ్ మాఫియా కండ్లముందే ధ్వంసం చేస్తుంటే ప్రజలు తల్లడిల్లిపోతున్నారు.
మైలారం గ్రామానికి అడవి 50మీటర్ల దూరంలోనే ఉంటుంది. గుట్టకింద పేదలు ఇండ్లు కట్టుకొని జీవ నం సాగిస్తున్నారు. 115ఎకరాల్లో గుట్ట విస్తరించి ఉంటుంది. గుట్టపై పురాతన లక్ష్మీనర్సింహ్మస్వామి ఆలయం, శివాలయం, గ్రామ దేవతల ఆలయాలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఇటీవల గుట్ట పై ప్రభుత్వ నిధులతో పల్లె ప్రకృతివనం, డంపింగ్ యార్డు, క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు. గుట్టను ఆధారంగా చేసుకొని మైలారం, కొండనాగుల, బల్మూర్ గ్రామాల రైతులు, పశువుల కాపరులు తమ జీవాలను మేపుకొంటారు. గుట్టకింద ఊరు అంచు నా చెరువు ఉంది.
చెరువును నమ్ముకొని కొండనాగుల, మైలారం, బల్మూర్ గ్రామాలకు చెందిన 2వేల ఎకరాల భూమికి సాగునీరు అందుతున్నది. చెరువు వల్ల భూగర్భజలాలు పెరిగి బోర్లు నడుస్తున్నాయి. చెరువుకు అనుకొని ఉన్న మైలారం గుట్టను రక్షణగా ఉమామహేశ్వరం రిజర్వాయర్ నిర్మాణం చేపట్టేందుకు గత ప్రభుత్వం టెండర్ కూడా పూర్తి చేసింది. రిజర్వాయర్ నిర్మాణానికి భూసేకరణ పనిలో అధికారులు ఉన్నారు. మైనింగ్ వల్ల రిజర్వాయర్ ని ర్మాణం జరుగుతుందా? లేదా అనేది ప్రజలకు అనుమానాలు రేకేత్తిస్తున్నాయి. కండ్లముందే గుట్ట కార్పొరేట్ శక్తులకు బలైపోతుంటే ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
తమ గుట్టను కాపాడుకునేందుకు మైలారం గ్రామస్తులు మొదటి నుంచి మైనింగ్ తవ్వకాలను వ్యతిరేకంగా అందోళనలు చేపట్టారు. ఉన్నతాధికారులు, ప్ర జాప్రతినిధులను కలిసి వినతిపత్రాలను అందజేశా రు. పార్లమెంట్ ఎన్నికలను కూడా బహిష్కరించా రు. అధికారులు వెళ్లి గ్రామస్తులకు నచ్చజెప్పి పో లింగ్ జరిగేవిధంగా చూసినా గ్రామస్తులు పెద్దగా పోలింగ్‌లో పాల్గొనలేదు. గతంలో అనేకసార్లు గ్రా మస్తులు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సమావేశాలు పెట్టి ఆందోళనలు చేపట్టారు. ఆందోళన, పనులు అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
శాంతియుతంగా రిలేదీక్షలు చేపట్టేందుకు పూనుకున్న గ్రామస్తులను పోలీసులు గ్రామంలోకి వచ్చి కొందరిని పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో గ్రామం అంతా కదిలి వారం కింద ఆందోళన చేపట్టారు. ముళ్లకంచేలు పెట్టి పోలీసులు గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. ఇలా గ్రామస్తులు ఎప్పటికప్పుడు మైనింగ్‌ను వ్యతిరేకించి గుట్టన కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నా ప్రభుత్వాలు ప్రజల బాధను పట్టించుకోకుండా కార్పొరేట్ కంపెనీకి వత్తాసు పలకడంతో గ్రామస్తులు ప్రభుత్వాలపై భగ్గుమంటున్నారు.
ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులు, ప్రభుత్వాలు వారిని వదిలేసి పోలీస్ పహారా మధ్య మైనింగ్ పనులు కొనసాగించడంపై ప్రజలు జీర్ణించుకోవడం లేదు. గుట్టపైకి గ్రామస్తులు, మీడియా ఎవరినీ అనుమతించడం లేదు. పశులు, మేకలను మేప నివ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవిలోకి పశువులు, జీవాలను మేపేందుకు తీసుకెళ్తే ఫారెస్టు అధికారులు కేసులు పెడుతున్నారు. గుట్టపైకి తీసుకెళ్తే మైనింగ్ మాఫియా రానివ్వడం లేదని ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు.
మైలారం గుట్టను 20ఏండ్ల్ల పాటు కంపెనీకి మైనింగ్ శాఖ అనుమతులు ఇచ్చింది. సర్వే నెంబర్ 120/ 1లో 24.28హెక్టార్లు మైనింగ్ కంపెనీకి మైనింగ్ శాఖ 2018లో అనుమతి ఇచ్చింది. 2018 లో గ్రామస్తులు మైనింగ్ అనుమతులపై అభ్యంతరాలపై నివేదిక పంపించారు. ఫోర్జరీ సంతకాలతో గ్రామ పంచాయతీ తీర్మానం చేసి అనుమతి పొందారని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మైనింగ్‌తో చెరు వు, అటవీ, పర్యావరణానికి ఎటువంటి ఇ బ్బంది లేదని మైనింగ్‌శాఖ అనుమతినిచ్చింది.
అయితే గ్రామసభ ఆమోదం లేకుండా ఫోర్జరీ సంతకాలతో చేసిన తీర్మానంపై గ్రామస్తులు అనేకసార్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కంపెనీ మిషన్లు వచ్చినా తిప్పి పంపించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనింగ్ లీజుదారు గుట్టపై ఉన్న భా రీ చెట్లను తొలగించి రోడ్లు వేసుకోవడం, పనులు చేపట్టడం ప్రారంభించారు.
గత ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఈ ప్రభుత్వ పెద్దలు చెప్పడం, గత ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పనులు ప్రారంభంకావడం, ఈ ప్రభు త్వం మైనింగ్‌ను సీరియస్‌గా తీసుకోకపోవడంపై స్థానికులు అనేక అనుమానాలు వ్యక్తం చేశా రు. ప్ర భుత్వం సీరియస్‌గా తీసుకుంటే లీజు రద్దు చేసే అవకాశాలు లేవా?అనే ప్రశ్నలు ఉత్పన్న మవుత్తున్నా యి. దీనిపై హైకోర్టులో కూడా ఫిర్యాదు చేశారు. ప్ర జలు ఇన్ని ఆందోళనలు చేస్తున్నా గుట్టపై తవ్వకాల పనులు యథావిధిగా కొనసాగుతున్నాయి.
2014 నుంచి 2018లో ఉమ్మడి అనంతవ రం గ్రామపంచాయతీ పాలక సభ్యులు, సర్పం చు తీర్మానం చేశారు. అప్పటి ఎమ్మెల్యే గువ్వల తో మాట్లాడి అనుమతులు రాకుండా నిలిపివే శాం. మైనింగ్ ద్వారా విషవాయువులు వెలువడి అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పాం. మైనిం గ్ నిలిపివేయాలని నిరసన, ర్యాలీలు చేయడం తో అప్పటి ఎమ్మెల్యే గువ్వల మైనింగ్ పనులను నిలిపివేయించారు. ప్రస్తుత ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రత్యేక చొరువ తీసుకోవాలి.
– వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్, గుట్ట పరిరక్షణ పోరాట కమిటీ అధ్యక్షుడు
గుట్టపైకి ముగజీవాలను పశుగ్రాసం కోసం తీసుకెళ్తే మైనింగ్ మా ఫియా వాళ్లు బెదిరిస్తున్నారు. పోలీసులతో కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేస్తున్నా రు. ఉమ్మడి అనంతవరం జీపీ ఉన్నప్పుడు మైనింగ్ జరిపేది లే దని తీర్మానం చేశారు. ఓట్లప్పుడు మాత్రమే నాయకులకు మేం గుర్తుకొస్తాము. సమస్యల్లో ఉన్నప్పుడూ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మైనింగ్ పనులను నిలిపివేయాలి.
– గుడెల్లి రాములు, మైలారం
అనంతవరం ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే అప్పటి సర్పం చ్, ఎంపీటీసీ, జీపీ సభ్యులు మైనింగ్ సిబ్బందితో రూ.లక్ష లు తీసుకొని అనుమతులు ఇ చ్చారు. మైనింగ్ పనుల కారణంగా మూగజీవాలు మృత్యు వాతపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పైసల కోసం కక్కుర్తిపడి ఎమ్మెల్యేపై ఒత్తిడి పెంచి కావాలని పనుల ను చేయిస్తున్నారు. ప్రశ్నిస్తే మాపై కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారు.
– లక్ష్మయ్య, అనంతవరం